
Pakistan Financial Crisis 2023: ఉగ్రదాడులు, అకాల వర్షాలు, ఎండలు.. ఇదీ దాయాది దేశం పరిస్థితి. ఆర్థిక అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ సాయం కోసం ఎదురుచూస్తోంది. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు. రోజు రోజుకూ ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. పేదరికంలోకి జారిపోతున్నారు. తాజాగా ప్రపంచ రేటింగ్ సంస్థ వ్యాఖ్యలు ఆ దేశ దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంతకీ ఆ దేశమేంటో ? అక్కడి వాస్తవ స్థితిగతులు ఏంటో తెలుసుకోండి.
పాకిస్థాన్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రపంచ రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. పాక్ కరెన్సీకి గతంలో ఇచ్చిన రేటింగ్ సిసిసి + నుంచి ఇష్యూర్ డీఫాల్ట్ రేటింగ్ సిసిసి మైనస్ కు తగ్గించింది. దీంతో పాక్ నగదు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు విదేశీ మారక నిల్వలు కనిష్ఠానికి పడిపోవడం, బయట నుంచి ద్రవ్య మద్దతు తగ్గడం వంటి అంశాలను ఈ రేటింగ్ సూచిస్తోంది. విదేశీ మారక నిల్వలు కనిపిస్తున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళ్తోందని ఫిచ్ అంచనా వేసింది. కరెంటు ఖాతా లోటు, విదేశీ చెల్లింపుల్లో ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తక్కువగా ఉన్నట్టు భావిస్తున్నామని ఫిచ్ తెలిపింది. కానీ పాక్ తీసుకొంటున్న కొన్ని చర్యల ఫలితంగా ఓ మోస్తారు కోలుకునే అవకాశం ఉందని ఫిచ్ అంచనా వేసింది.
దివాళా తీయడం లేదా రుణపునర్వ్యస్థీకరణ ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని ఫిచ్ వెల్లడించింది. అకాల వర్షాలు, ఎండలు, ఉగ్రదాడులతో పాక్ లో అస్థిరత నెలకొన్నట్టు తెలిపింది. పాక్ లో ఇటీవలి ఐఎంఎఫ్ బృందం పదిరోజులు పర్యటించింది. కానీ పాక్ ఎలాంటి సాయం పొందలేకపోయిందని ఫిచ్ పేర్కొంది. మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగదలతో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు ధరల భారం, మరోవైపు నిరుద్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కాయి. దీంతో మిగిలిన వస్తువుల ధరలు కూడా అదే విధంగా ఉన్నాయి.

పాకిస్థాన్ దివాళా తీయడానికి చైనా నుంచి అధికంగా రుణాలు తీసుకోవడమే అని తెలుస్తోంది. స్థాయికి మించి అప్పులు చేయడంతో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు శాంతిభద్రతలు పూర్తీగా క్షీణించినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పవచ్చు. అవసరం లేని సమయంలో విద్యుత్ వాడొద్దని ప్రభుత్వమే ప్రజలకు సూచిస్తోంది. క్యాబినెట్ మీటింగ్ సైతం లైట్లు ఆర్పి నిర్వహించారంటే పాక్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ కు ప్రపంచ దేశాల సహాయం అత్యవసరం. కానీ ఐఎంఎఫ్ నుంచి నిధులు సాధించలేకపోయిందంటే .. ప్రపంచ దేశాల నుంచి ఏమేరకు సాయం పొందుతుందో వేచిచూడాలి.