
AP BJP: ఏపీ విషయంలో బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోందా? ప్రత్యేక పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? కాపు అంశాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోందా? అందుకే కొత్తగా వంగవీటి మోహన్ రంగా పేరును తెరపైకి తెచ్చిందా? అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ ఫేమ్ ను వాడుకోవాలని ప్రయత్నిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నారు. యావత్ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ఏపీ పరిస్థితులు మాత్రం మింగుడుపడడం లేదు. ఇక్కడ పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లవుతున్నా.. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా, కర్నాటక తరహాలో ఓట్లు పెంచుకోలేకపోతోంది. సీట్లు పెంచుకోలేకపోతోంది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన విపక్షంగా టీడీపీ బలంగా ఉన్నాయి. అటు జనసేన కూడా బలం పుంజుకుంది. దీంతో ఏదో పార్టీతో వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీది. మిత్రపక్షంగా ఉన్న జనసేన వైపు మాత్రమే బీజేపీ మొగ్గుచూపుతోంది. కానీ వైసీపీని ఎదుర్కొవాలంటే బీజేపీ, జనసేన కలిస్తే మాత్రం సరిపోదని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆయన టీడీపీని కలుపుకొని పోవాలని భావిస్తున్నారు. కానీ ఇందుకు టీడీపీ ఇష్టపడడం లేదు. అటు చంద్రబాబు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళితే ఉత్తమమని భావిస్తున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో కలిసి నడిచేందుకు బీజేపీ ఇష్టపడడం లేదు.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బీజేపీ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గవర్నర్ ను మార్చింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన అబ్దుల్ నజీర్ ను నియమించింది. కేంద్ర పెద్దలకు వీర విధేయత చూపే విశ్వభూషణ్ హరిచందన్ ను సడెన్ గా మార్చింది. ఈ మాజీ న్యాయమూర్తిని గవర్నర్ గా నియమించాలనుకుంటే ఏకంగా చత్తీస్ గడ్ కు పంపించవచ్చు కదా అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. గత నెల 4న అబ్ధుల్ నజీర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఇంతలోనే ఆయన్ను ఏపీ గవర్నర్ గా నియమించడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు చిక్కుముడిగా మారింది.

అదే సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ కొత్తగా కాపు నామస్మరణ చేస్తున్నారు. మొన్నటికి మొన్న రాజ్యసభలో కాపు రిజర్వేషన్ బిల్లుపై ప్రశ్నించారు. కేంద్రం నుంచి సమాధానం రాబెట్టారు. దీంతో కాపులు ఆయన్ను సన్మానించి తమ రుణం తీర్చుకున్నారు. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకేసి రాజ్యసభలోనే వంగవీటి మోహన్ రంగాను ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ఆయనకు బీజేపీ హైకమాండ్ కాపుల టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ద్వారా కమ్మ సామాజికవర్గానికి దగ్గర కావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ పేరిట రూ.100 కాయిన్ ను ముద్రించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల మింట్ అధికారులు పురందేశ్వరిని కలిశారు. అభిప్రాయాన్ని తీసుకున్నారు. త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్ అందుబాటులోకి రానుంది.
అటు వైసీపీ ధిక్కార ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు బీజేపీ పెద్దల నుంచి డైరెక్ట్ గా ఫోన్లు వెళ్లాయి. పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు జగన్ సైతం 23 మంది ఎమ్మెల్యేలను తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వారందర్నీ పార్టీలోకి రప్పించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గవర్నర్ మార్పు, ధిక్కార ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకోవడం, మోహన్ రంగా పేరుతో కాపులకు దగ్గర కావడం, ఎన్టీఆర్ కి సముచిత స్థానం ఇచ్చి కమ్మ సామాజికవర్గానికి ఆకట్టుకోవడం.. ఇలా బహుముఖ వ్యూహంతో బీజేపీ వెళుతుండడం చర్చనీయాంశంగా మారింది.