
Chennai: మటన్ తిన్నామని ఎముకలు మెడలో వేసుకోలేం. మందు తాగుతామని మెడలో సీసా కట్టుకుని తిరగలేం. అలాగని ఓ సిప్ వేసుకోమంటే.. ఫుల్ బాటిల్ కడుపులోకి తోసేయలేం. కానీ ఓ ప్రబుద్ధుడు అదే పనిచేశాడు. కక్కుర్తి పడి ఫుల్ బాటిల్ లేపేశాడు. పీటలెక్కాల్సిన పెళ్లిని పెటాకులు చేసుకున్నాడు. పెళ్లి పందిరిని చిందర వందర చేశాడు. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందాం పదండి.
చెన్నైలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మినరసింహన్ అనే వ్యక్తికి రెండు రోజుల క్రితం పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి ఒకరోజు మందు వధువు కుటుంబ సభ్యులు విందు ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు ముఖ్య అతిథిగా వెళ్లాడు. విందులోవధూవరులతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతమందిలో ఏదో మర్యాద కోసం ఓ సిప్ వేసి ఉంటే సరిపోయేది. ఇక జీవితంలో మళ్లీ అవకాశం దొరుకుతుందో లేదో అన్నట్టు కక్కుర్తిపడి ఫుల్లుగా తాగేశాడు. మోతాదుకు మించి తాగడంతో భూమి, ఆకాశం ఏకమైంది. కన్నుమిన్ను కానకుండాపోయింది.
ఫుల్లుగా తాగిన పెళ్లికొడుకు వధువుతో అసభ్యంగా ప్రవర్తించాడు. పెళ్లికి ముందే బంధువులందరి ముందు తాగడం వధువుకు అవమానంగా తోచింది. పెళ్లికొడుక్కి చీవాట్లు పెట్టింది. పెళ్లిని క్యాన్సిల్ చేసింది. విందు నుంచి వెళ్లిపోయింది. ఫుల్లుగా తాగిన పెళ్లికొడుక్కి తాగింది దిగేలా షాక్ ఇచ్చింది. పెళ్లి కూతరు చేసిన పనికి బంధువులంతా నిర్ఘాంతపోయారు. ఒక్కొక్కరికి తాగిన మైకం దిగిపోయింది. పెళ్లి కొడుకు ముఖం వాడిపోయింది. పీటలెక్కకుండానే పెటాకులయింది. దీంతో ఏం చేయాలో తోచక తెల్లముఖం వేసుకుని ఉండిపోయాడు.

డబ్బు చేతినిండా ఉండటంతో… ఫ్యాషన్ వెర్రితలలు వేస్తోందని చెప్పవచ్చు. లేని సంస్కృతి, అలవాట్లు, పద్ధతులతో పీటలు ఎక్కాల్సిన పెళ్లిళ్లు పెటాకులు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. పెళ్లికి మందు విందులు, వినోదాలు, మందు తాగడాలు మన సంస్కృతి అసలే కాదు. కానీ ఇప్పుడు విదేశీ సంస్కృతి మన పెళ్లిళ్లను కూడా చుట్టేసిందని చెప్పవచ్చు. పెళ్లి నిర్వహణలో కచ్చితమైన పద్దతులు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే పెళ్లి పదికాలాల పాటు నిలబడుతుంది.