BRS MLAs Secret Meeting: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టిందా.. అధిష్టానంపై అసమ్మతి మొదలైందా.. ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా.. అంటే గులాబీ సర్కిల్స్ నుంచి అవుననే సమాధానం వస్తోంది. అన్నీ తామై బీఆర్‌ఎస్ పార్టీని నడిపిస్తున్న కేసీఆర్, ఆయన కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలుఉ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లుగా చిన్నచిన్న అలకలు మినహా ఎక్కడా పెద్దగా అసమ్మతి బీఆర్‌ఎస్‌లో కనిపించలేదు. ఒకరిద్దరు నేతలు పార్టీని వీడారు. పెద్ద ఘటన అంటే ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌చేసి పార్టీ నుంచి బయటకు పంపేయడమే. తాజా పరిణామాలు చూస్తుంటే బీఆర్‌ఎస్ అధినేతలపై ఎమ్మెల్యేలు, నాయకులు తిరుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

దర్యాప్తు సంస్థల దూకుడుతో
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈడీ, ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం నడుస్తోంది. ఎప్పుడు ఈడీ నోటీసులు వస్తాయోునని అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు హడలెత్తిపోతున్నారు. అటు వరుసగా తెలంగాణ మంత్రులు అయిన తలసాని, మల్లారెడ్డి ఇళ్లు, ఆస్తుపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. పైలట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ పార్టీ ఓ అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. తమ దారి తాము చూసుకోవడమే మేలన్నన భావన కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నేతల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ వ్యక్తిగత పగ, ప్రతీకారానికి తామెందుకు బలికావాలన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.
బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ పేరుతో.. ఎమ్మెల్యేల రహస్యభేటీ
హైదరాబాదులో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సోమవారం జరిగిన ఈ భేటీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ సమస్యలపైనే భేటీ అని ఆయా నేతలు చెబుతుండగా, ఓ మంత్రికి వ్యతిరేకంగా వీరంతా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

అధిష్టానంపై తిరుబాటేనా..?
ఎమ్మెల్యేల భేటీ సొంతపార్టీలోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో నూతన కమిటీల విషయంలో కొండా సురేఖ రాజీనామాతో మొదలైను అసమ్మతి ఇప్పుడు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయే పరిస్థితికి చేరింది. టీఆర్‌ఎస్‌లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటుందా అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీలో చాలామంది అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. అధికారంలో ఉంది కాబట్టి బయటకు చెప్పలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఈ అసమ్మతి బ్లాస్ట్ అవుతుందన్న చర్చ చాలారోజులుగా జరుగుతోంది. అయితే తాజాగా ఎమ్మెల్యేల రహస్య భేటీతో ఇప్పుడు అసమ్మతి వాదులంతా అధిష్టానంపై తిరుబాటు చేసేందుకు వెనుకాడకపోవచ్చన అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అసమ్మతి భేటీని గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎలా పరిగణిస్తారో వేచిచూడాలి.