Sashtang Namaskara Yatra: ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. చెప్పులు, ఛత్రి, నెత్తికి టోపీ, చెవులకు రుమాల్ కట్టుకుని కూడా బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ, మండుతున్న ఎండలో కూడా ఈ సాధావులు యాత్ర చేస్తున్నారు. అదీ సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారి యాత్రను చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ నుంచి..
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాగ సాధువులు లోకకళ్యాణార్థం ఉత్తరాఖండ్ లోని గంగోత్రి నుంచి ఈ సాష్టాంగ నమస్కార యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యాత్ర తెలంగాణలోనిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణానికి చేరుకుంది శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి వారి యాత్రను ప్రారంభించారు.
ధర్మకోల్ షీట్‌పై సాష్టాంగ నమస్కారం చేస్తూ..
ధర్మకోల్ షీట్ లాంటి దుప్పటిని రోడ్డుపై పరిచి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ నాగసాధువులు ముందుకు సాగుతున్నారు. చేతిలో రాళ్లు పట్టుకుని.. థర్మకోల్ షీట్ కింద పరిచి దానిపై సాష్టాంగ నమస్కారం చేసి చేయిచాచి.. అందులోని రాయిని అక్కడ పెడుతున్నారు. మళ్లీ పైకిలేచి.. ఆరాయి దగ్గర మళ్లీ థర్మకోల్‌షీట్ పరిచి మళ్లీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఇలా వారియాత్ర సాగుతోంది. సాధువుల భక్తిని చూసి ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో సాగుతున్న ఈ యాత్ర సామాన్య భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. వేకువ జాముతో యాత్ర ప్రారంభించే వీరు సాయంత్రం వరకు అత్యంత నియమనిష్టలతో సాష్టాంగ నమస్కారం యాత్ర సాగిస్తున్నారు. సాయంత్రం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి పూజార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రామేశ్వరం వరకూ..
నాగసాధువులు ఇప్పటి వరకు 4 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు తెలిపారు. రామేశ్వరానికి చేరుకోవడంతో యాత్ర పరిపూర్ణమవుతుందని పేర్కొంటున్నారు. లోకకళ్యాణం కోసమే ఈ యాత్ర చేపట్టామని పేర్కొంటున్నారు. యాత్ర సాగుతున్నంతసేపు ఎలాంటి ఆహారం తీసుకోమని సాధువులు తెలిపారు. సాయంత్రం పూజ చేసిన తర్వాతనే ఆహారం తీసుకుంటున్నారు.
సాష్టాంగ నమస్కారం అంటే..
హిందూ ప్రామాణిక గ్రంథాలలో సైతం సస్తాంగ నమస్కారానికి ఎంతో విశిష్టత ఉంది. ఉరసా – తొడలు, శిరసా – తల, దృష్ట్యా – కళ్లు, మనసా – హృదయం, వచసా – నోరు, పద్భ్యాం – పాదాలు, కరాభ్యాం – చేతులు, కర్ణాభ్యాం – చెవులు.. ఇలా ఎనిమిది అంగాలు నేలను తాకేలా నమస్కారం చేయడాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. సహజంగా మనిషి ఈ ఎనిమిది అంగాలతోనే దోషాలు చేస్తుంటాడు. ఆ పాపాలను తొలగించమని, సద్బుద్ధిని ప్రసాదించమని వేడుకుంటూ నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది.