Vishnu Manchu- Karate Kalyani: ఖమ్మం నగరంలో గల లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని మే 28న ఈ కార్యక్రమం తలపెట్టారు. అయితే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు యాదవ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం తగదని, అది మా మనోభావాలను దెబ్బతీయడమేనని వాదిస్తున్నారు. అఖిల భారత యాదవ సమితి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. హై కోర్టు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది.
మొదటి నుండి నటి కరాటే కళ్యాణి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దేవుడు రూపంలో ఉన్న మానవుల విగ్రహాలు పెట్టడం తగదంటున్నారు. యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలిగా ఉన్న కరాటే కళ్యాణి కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాతో తన అసహనం బయటపెట్టారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ అయ్యారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదంలో తలదూర్చిన ఆమె వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపారు.
లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ఆపివేయాలంటూ తెలంగాణ హై కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో తనకు షోకాజ్ నోటీసులు పంపిన మంచు విష్ణు మీద కరాటే కళ్యాణి ఫైర్ అయినట్లు సమాచారం అందుతుంది. మరి హై కోర్టు స్టే వేధించింది. హైకోర్టుకు కూడా నోటీసులు పంపుతావా? హైకోర్టు మీద కూడా చర్యలు తీసుకుంటావా? అని ప్రశ్నించినట్లు సమాచారం. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా నోటీలు పంపారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
మా అధ్యక్షుడు మంచు విష్ణును ఉద్దేశిస్తూ కరాటే కళ్యాణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కరాటే కళ్యాణి విష్ణు ప్యానెల్ నుండే పోటీ చేయడం విశేషం. మా కార్యవర్గాన్ని సంప్రదించకుండా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడారనే అభియోగంపై ఆమెకు నోటీసులు పంపారు. ఇప్పుడు కోర్టే తగదని చెప్పడంతో కరాటే కళ్యాణి ఫైర్ అవుతున్నారు. కరాటే కళ్యాణి లైఫ్ లో అనేక కాంట్రవర్సీలు ఉన్నాయి. తాజా ఉదంతంతో ఆమె మరోసారి హైలైట్ అయ్యారు. ఇక అనుకున్నట్లుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగితే… జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.