Singer Parvathi: కడుపు నిండిన వాడు నాలుగు మెతుకులు పంచి పెట్టడంలో గొప్పతనం ఏమీ లేదు, కానీ.. ఖాళీ కడుపుతో కూడా ఎదుటివాళ్ళ ఆకలిని తీర్చడం నిజంగా గొప్పతనమే. కటిక పేదరికంలో కూడా ఉన్నతమైన బావాలను కలిగి ఉండటం, వాటిని నిలబెట్టుకోవడం.. నేటి ఆధునిక సమాజంలో సాధ్యం అవుతుందా ? సాధ్యం చేసి చూపించింది ఒక సాధారణ అమ్మాయి.
ఊరంతా వెన్నెల… మనసంతా చీకటి… అంటూ తాను పాడిన పాటతో.. తన ఊరిలో వెలుగుల నింపి.. అందరి మనస్సులో నిలిచింది గాయని ‘పార్వతి’.
గానంతో వానలు, రాగాలతో రాళ్లు కరుగుతాయో లేదో తెలియదు గానీ , తన నిస్వార్ధమైన ఆలోచనతో ‘పార్వతి’ ప్రేక్షకుల దృష్టిని, గ్రామ ప్రజల అభిమానాన్ని గెలుచుకుంది.
Also Read: బీజేపీ చూపు ముద్రగడ వైపు.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు?
తన మధురమైన పాటతో తమ ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చేసింది. ఏళ్ల తరబడి ఆ గ్రామం అంతా అధికారుల చుట్టూ తిరుగుతూ మొరపెట్టుకున్నా ఫలితం లేని సమస్యను కేవలం ఒకే ఒక్క పాటతో పరిష్కరించింది.
‘పార్వతి’ది కర్నూలు జిల్లాలోని ‘లక్కసాగరం’ అనే గ్రామం. ఆమె అమ్మ నాన్న మీనాక్షమ్మ, శ్రీనివాసులు అతి సాధారణ కూలీలు. దీనికితోడు ఆ ప్రాంతంలో కరువు వల్ల పంటలకు నష్టం రావడం ఆనవాయితీ. దాంతో ఎన్నో ఆకలి బాధలు, మరెన్నో ఆర్ధిక ఇబ్బందులు.. వీటన్నింటి మధ్యలో కూడా గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించి.. ఎందరో పేద బాలికలకు ప్రేరణగా నిలిచింది గాయని ‘పార్వతి’.
చిన్నతనం నుంచి ఆమెకు సంగీతమంటే ప్రాణం. ఆమె ఇష్టాన్ని గమనించిన ఆమె పెద్దన్న చంద్ర మోహన్.. పార్వతిని ‘తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేర్పించాడు. దీనికితోడు ఎన్నో పాటల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే ‘జీ-సరిగమప’లో అవకాశం దక్కించుకుంది.
జీ-సరిగమప’లో ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ పాట పాడి సంగీత దర్శకుడు కోటిని అబ్బురపరిచింది. ‘నీకు ఏం కావాలమ్మా..?’ అంటూ కోటి ఆమెకు అడిగితే.. ‘నాకేం వద్దు సర్, మా ఊరికి బస్సు కావాలని కోరుకుంది. అది కూడా తన ఊరు హైస్కూల్ పిల్లల కోసం. చదువుకునే వయసులో తనలా మరొకరు ఇబ్బంది పడకూడదు అని పార్వతి బస్సును కావాలని అడిగింది.
ఆమె కోరిక విన్న రవాణా శాఖ అధికారులు ఆ ఉరికి బస్సు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా పార్వతి మంచితనానికి ‘జీ-సరిగమప’నే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుందాం. ‘పార్వతి’ మంచి మనసుకు మా ‘ఓకేతెలుగు’ తరఫున ప్రత్యేక అభినందనలు.
Also Read: జాతర చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. కళ్ల ముందే అగ్నిగోళం
Recommended Video: