Avatar 3 Box Office : జేమ్స్ కెమరూన్(James cameron) తెరకెక్కించిన ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్'(Avatar 3 : The fire & ash) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ‘అవతార్ 2 : ది వే ఆఫ్ వాటర్’ కంటే ఈ చిత్రం బాగుంది అనే టాక్ అయితే వచ్చింది కానీ, ఎందుకో కలెక్షన్స్ మాత్రం ‘అవతార్ 2’ లో సగం కూడా లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఉదాహరణకు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తీసుకుందాం. ‘అవతార్ 2’ చిత్రానికి మొదటి వీకెండ్ లో దాదాపుగా 130 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘అవతార్ 3’ కి మొదటి వీకెండ్ మొత్తం కలిపి 75 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఇండియా లోనే ఇలాంటి పరిస్థితి ఉందా అంటే, కచ్చితంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి చూసినా ఇదే పరిస్థితి.
అవతార్ సిరీస్ నుండి వచ్చిన మొదటి రెండు సినిమాలు కూడా చెరో 3 బిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. కానీ ‘అవతార్ 3’ చిత్రం మాత్రం ఫుల్ రన్ లో 1.6 బిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి మూడు రోజులు వచ్చినా వసూళ్లను చూస్తే, డొమెస్టిక్ మార్కెట్, అనగా నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి మొదటి మూడు రోజులకు కలిపి 88 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నార్త్ అమెరికా లో ‘అవతార్ 2’ వచ్చిన వసూళ్లతో పోలిస్తే అక్షరాలా 34 శాతం తక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు, డిజాస్టర్ అని పిలవొచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 257 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అంటే ‘అవతార్ 2’ తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్ లో ‘అవతార్ 3’ కి 16 శాతం వసూళ్లు తగ్గాయి అన్నమాట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 345 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది చాలా అంటే చాలా తక్కువ. ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ పోతే, జనవరి 1 కి కూడా ఈ చిత్రం 1 బిలియన్ డాలర్ మార్కుని అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఓవరాల్ గా 1.6 బిలియన్ డాలర్స్ కి పరిమితం అయ్యేలా ఉంది. బ్రేక్ ఈవ్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 2.5 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రావాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.