Sarath Babu Funerals : నటుడు శరత్ బాబు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన మృతదేహం ఉంటారు. అనంతరం చెన్నై తరలించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శరత్ బాబుకు వారసులు లేరు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళే ఈ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. కొడుకులు, కూతుళ్లు లేని పక్షంలో ఆయనకు తలకొరివి ఎవరు పెడతారనే చర్చ నడుస్తోంది. శరత్ బాబుది పెద్ద కుటుంబం. వారు మొత్తం 14 మంది పిల్లలని సమాచారం.
గత కొంతకాలంగా శరత్ బాబు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెన్నై, బెంగుళూరు ఆసుపత్రుల్లో శరత్ బాబుకు చికిత్స జరిగింది. అనంతరం కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కొద్ది రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతుంది. శరీరమంతటా ఇన్ఫెక్షన్ చేరడంతో ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో శరత్ బాబు కన్నుమూశారు. శరత్ బాబు వయసు 71 ఏళ్ళు.
శరత్ బాబు 1973లో విడుదలైన రామ రాజ్యం మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. మరో చరిత్ర, సీతాకోకచిలుక, సాగర సంగమం, సంసారం ఒక చదరంగం, స్వాతిముత్యం వంటి చిత్రాలు ఆయనకు ఫేమ్ తెచ్చాయి. 250కి పైగా చిత్రాల్లో నటించారు. మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు. విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. శరత్ బాబు చివరి చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ చిత్రంలో ఆయన సూపర్ స్టార్ కృష్ణ నిజజీవిత పాత్ర చేశారు.
శరత్ బాబు లేడీ కమెడియన్ రమాప్రభను ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. అనంతరం మరో మహిళను శరత్ బాబు వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా విడాకులు అయ్యాయి. అప్పటి నుండి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. శరత్ బాబు మృతిపై చిరంజీవితో పాటు చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుభూతి తెలియజేశారు. శరత్ బాబు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.