Sangareddy District: అమ్మ రూపాన్ని మర్చిపోలేక.. ఆమె చివరి కోరిక తీర్చేందుకు.. ఈ కొడుకులు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల అనే గ్రామానికి చెందిన చెన్నంశెట్టి సత్యనారాయణ, నాగలక్ష్మి కి 50 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరిది ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం. స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేత పట్టుకుని బతుకుతెరువు కోసం 1978లో గుమ్మడిదల అనే గ్రామానికి వచ్చారు.

Written By: Suresh, Updated On : March 3, 2024 6:39 pm

Sangareddy District

Follow us on

Sangareddy District: తీగకు కాయ ఎప్పుడూ బరువు కాదు. ఎన్ని కాయలనైనా తీగ భరిస్తుంది. ప్రేమగా మోస్తుంది. కానీ కాయలే తీగను బరువునుకుంటున్నాయి. ప్రస్తుత సమాజంలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.. తమను కని, పెంచి, పోషించిన తల్లిదండ్రులను బిడ్డలు కాదనుకుంటున్నారు. చరమాంకంలో వృద్ధాశ్రమంలో చేర్చుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. చదువు నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పిల్లలు.. తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చుతున్నారు. ఫలితంగా బంధాలు, అనుబంధాలు మాయమైపోతున్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ప్రస్తుత సమాజంలో.. కొందరు కొడుకులు చేసిన పని వినూత్నంగా నిలిచింది. అమ్మ పై ప్రేమ ఎలా ఉంటుందో నిరూపించింది.

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల అనే గ్రామానికి చెందిన చెన్నంశెట్టి సత్యనారాయణ, నాగలక్ష్మి కి 50 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరిది ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం. స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేత పట్టుకుని బతుకుతెరువు కోసం 1978లో గుమ్మడిదల అనే గ్రామానికి వచ్చారు. ఆ ఊర్లో చిన్న గుడిసె వేస్తున్నారు. సత్యనారాయణ స్థానికంగా ఉన్న ఓ రైస్ మిల్ లో మెకానిక్ పనిచేసేవాడు. సత్యనారాయణ, నాగలక్ష్మి దంపతులకు ఐదుగురు కొడుకులు సంతానంగా కలిగారు. కొడుకులు ఎదగడంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొడుకులకు పెళ్లిళ్ళు కావడంతో సత్యనారాయణ ఇల్లు సందడిగా ఉండేది. ఒకానొక సందర్భంలో తన పెళ్లి జరిగినప్పుడు కనీసం దండలు కూడా వేసుకోలేనంత పేదరికంలో ఉండేవాళ్ళమని నాగలక్ష్మి తెగ బాధ పడిపోయింది. దీంతో కొడుకులు, కోడళ్ళు అప్పట్లో నిర్ణయానికి వచ్చారు. తమ తల్లిదండ్రుల 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరపాలి అనుకున్నారు.

ఈలోగా నాగలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తల్లి రూపాన్ని మర్చిపోలేక ఆ కొడుకులు తల్లడిల్లిపోయారు. ఆమె బతుకున్నప్పుడు ఇచ్చిన మాటను నెరవేర్చారు. మార్చి 1న తమ తల్లిదండ్రుల 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లి నాగలక్ష్మి విగ్రహాన్ని తయారుచేసి.. వేదికపై తమ తండ్రి కూర్చున్న కుర్చీ పక్కన మరొక కుర్చీ వేసి అందులో విగ్రహాన్ని ఏర్పాటు చేసి దండలు వేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది దాకా బంధుమిత్రులు హాజరయ్యారు. తమ తల్లి గతించిపోయినప్పటికీ.. ఆమెకు ఇచ్చిన మాటను కొడుకులు ఇలా నెరవేర్చారు.. తమ తల్లి చివరి కోరికను నెరవేర్చారు. తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత పట్టించుకోని కొడుకులు ఉన్న ఈ సమాజంలో.. నాగలక్ష్మి కుమారుడు చేసిన పని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.