TV5 internal changes : టీవీ5 ఛానల్ లో మూర్తి చాలాకాలంగా కనిపిస్తున్నాడు. గతంలో ఇతడు ఏబీఎన్ లో పనిచేసేవాడు. అంతకుముందు ఎన్టీవీ లో పని చేసేవాడు. దానికంటే ముందు మహా టీవీలో పనిచేశాడు ఇక టీవీ 5 లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాడు. ప్రైమ్ టైం లో డిబేట్ నిర్వహించే మూర్తి.. ఇప్పుడు ఏకంగా సీఈఓ అయిపోయాడు. అదే విషయాన్ని టీవీ5 యాజమాన్యం తన సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. గతంలో సీఈవోగా వేరే వ్యక్తి ఉండగా.. ఈసారి మూర్తిని ఆ పదవి వరించింది.
టీవీ 5 లో చాలాకాలంగా పనిచేస్తున్న రావిపాటి విజయ్ ని న్యూస్ డైరెక్టర్ గా నియమించారు.. ముఖ్యంగా బిజినెస్ వార్తలను ప్రజెంట్ చేయడంలో రావిపాటి విజయ్ సిద్ధహస్తుడు. ఆవేశానికి గురి కాకుండా.. విషయాన్ని విషయం తీరుగా చెప్పడంలో రవి దిట్ట. పైగా బిఆర్ నాయుడికి అత్యంత నమ్మకమైన వ్యక్తి కావడంతో అతడిని ఈ పదవి వివరించింది.
బలవంత్ రెడ్డి తెరపైకి కనిపించరు కాబట్టి చాలామందికి తెలియదు. ఆయనను డిస్ట్రిబ్యూషన్ డైరెక్టర్ గా నియమించారు. శ్రీనివాసమూర్తిని డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గా నియమించారు. అనిల్ సింగ్ ను ఫైనాన్స్ విభాగానికి డైరెక్టర్ గా నియమించారు. మొత్తంగా ఐదు శాఖలకు ఐదుగురు వ్యక్తులను నియమించి బిఆర్ నాయుడు ఒకరకంగా ఛానల్ ను పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే టీవీ9 మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఎన్టీవీ రెండో స్థానంలో ఉంది. ఎన్టీవీ స్థానాన్ని ఆక్రమించాలని చాలాకాలంగా టివి5 యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగానే అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే తాజా మార్పులు ఏ మేరకు ఆ ఛానల్ వృద్ధికి సహకరిస్తాయనేది చూడాల్సి ఉంది.
ఇక టీవీ 5 లో కీలక వ్యక్తిగా ఉన్న సాంబశివరావుకు ఎటువంటి పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు ఉన్నట్టుండి ఒక్కసారిగా టీవీ 5 నుంచి మాయమయ్యారు. ఏదో ఛానల్ లో చేరిపోయారని ప్రచారం జరిగినప్పటికీ.. అదంతా అవాస్తవమని తేలింది. పైగా ఆమధ్య ఓ వివాదంలో ఆయన పేరు వినిపించింది. అయితే అది కూడా అవాస్తవమని తేలిపోయింది. దానిపై సాంబశివరావు వివరణ కూడా ఇచ్చారు. మొత్తంగా ఆ వివాదం సమసి పోయింది. ఇటీవల సాంబశివరావు మళ్లీ టీవీ5లో చేరారు.. ప్రైమ్ టైం లో డిబేట్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో ఒక రకమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే అతడికి కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అయితే ఆయనకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు?.. ఏ విభాగంలోకి ఆయనను తీసుకుంటారు? అనేది చూడాల్సి ఉంది.
