Sam Bankman Fried: క్రిప్టో కింగ్.. క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్‌టీఎక్స్ కో ఫౌండర్ సామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్ బిలియన్ డాలర్ల మోసం కేసులో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. క్రిప్టో కరెన్సీ మార్పిడితో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన ఎఫ్‌టీఎక్స్ 2022లోఎ పతనమైంది. హఠాత్తుగా 99 శాతం పతనమై బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. కోట్ల మంది పెట్టుబడిదారులు నష్టపోయారు. దీనిపై నమోదైన కేసులో రెండేళ్లు వాదనల అనంతరం న్యూయార్క్ కోర్టు తీర్పు చెప్పింది. ఆర్థిక ద్రోహంలో ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు అయిన బ్యాంక్‌మన్ కు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
వందేళ్లు పడాలి..
వాస్తవానికి అమెరికా చట్టాల ప్రకారం బ్యాంక్‌మన్‌కు 100 ఏళ్ల జైలుశిక్ష పడాలి. బ్యాంక్‌మన్ చేసింది తొలి తప్పు – ఎలాంటి హింసకు పాల్పడలేదు. దీంతో శిక్షను ఐదు నుంచి ఆరున్నరేళ్లకు పరిమితం చేయాలని అతని లాయర్లు కోర్టును కోరారు. అయితే బ్యాంక్‌మన్ మీద న్యాయస్థానం కనికరం చూపినప్పటికీ అతనికి 40 ఏళ్లకు తగ్గకుండా శిక్ష విధించాల్సిందేనని ప్రభుత్వం తరపు లాయర్లు వాదించారు. చివరకు, కోర్టు 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది.
క్రిప్టో మేధావిగా..
ఎఫ్‌టీఎక్స్ పతనానికి ముందు వరకు సామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌ను క్రిప్టో బిలియనీర్‌గా, క్రిప్టో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పెట్టుబడిదారుగా, క్రిప్టో మేధావిగా పిలిచారు. ప్రస్తుతం బ్యాంక్ వయస్సు కేవలం 32 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం అతని సంపద 26 బిలియన్ డాలర్లకు చేరింది. చాలా చిన్న వయస్సులో అంత సంపదకు అధిపతిగా బ్యాంక్‌మన్ రికార్డ్ కూడా సృష్టించాడు.
అమెరికా చరిత్రలో అతి పెద్ద ఆర్థిక మోసం..
ఎఫ్‌టీఎక్స్ క్లయింట్లు వాస్తవంలో డబ్బును కోల్పోలేదన్న బ్యాంక్‌మన్ వాదనను న్యూయార్క్ కోర్ట్ తిరస్కరించింది. విచారణ సమయంలో బ్యాంక్‌మన్ అబద్ధాలు చెప్పాడని వ్యాఖ్యానించింది. ఎఫ్‌టీఎక్స్ పతనానికి సంబంధించి సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రీడ్ ఏడు మోసాలు, కుట్రలకు పాల్పడినట్లు 2023 నవంబర్‌లోనే యూఎస్ కోర్టు జ్యూరీ నిర్ధాచింది. ఇది అమెరికా చరిత్రలో అతి పెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటిగా నిలిచింది.
బిలియన్ డాలర్లు నష్టపోయిన క్లయింట్లు..
ఎఫ్‌టీఎక్స్ క్లయింట్లు 8 బిలియన్ డాలర్లు, ఎఫ్‌టీఎక్స్ ఈక్విటీ పెట్టుబడిదార్లు 1.7 బిలియన్ డాలర్లు, అలమెడా రీసెర్చ్ హెడ్జ్ ఫండ్ రుణదాతలు 1.3 బిలియన్ డాలర్లు నష్టపోయారని న్యాయమూర్తి లూయిస్ కప్లాన్ వెల్లడించారు.‘ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ డిపాజిట్లను తన హెడ్జ్ ఫండ్ అలమెడా ఖర్చు చేసిందన్న విషయం తనకు తెలియదని’ బ్యాంక్‌మన్ చెప్పడం కూడా అబద్ధమేనని, అతనికి తెలిసేస అంతా జరిగిందని కూడా న్యాయమూర్తి చెప్పారు.
ఉద్యోగం వదిలేసి..
బ్యాంక్‌మన్.. 2017లో వాల్‌స్ట్రీట్‌లో ఉద్యోగం వదిలేసి అలమెడా రీసెర్చ్ హెడ్జ్‌ఫండ్ స్థాపించాడు. ఎఫ్‌టీఎక్స్, అలమెడా సంస్థల మధ్య జరిగగిన లావాదేవీలతో ఎఫ్‌టీఎక్స్ విలువ పతనమైంది. 2022 నవంబర్ 11న బ్యాంక్‌మన్ అకస్మాత్తుగా తన సీఈవో పదవికి రాజీనామా చేశాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎఫ్‌టీఎక్స్, దివాలా చట్టం కింద రక్షణ కోసం దరఖాస్తు చేసింది. బ్యాంక్‌మన్ సంపద విలువ 24 గంటల్లో దాదాపు 94 శాతం పడిపోయింది, 991.5 మిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు, ఒక రోజులో ఏ బిలియనీర్ సంపదలో కూడా ఇంత క్షీణించలేదు. ఇదిలా ఉండగా సామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌ను 2023 ఆగస్టు నుంచి బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉంచారు.