Salt Hotel : ప్రపంచంలో ఎన్నో వింతలు.. అద్భుతమైన నిర్మాణాలు దాగున్నాయి. కొన్ని సహజసిద్ధంగా ఏర్పడినవి అయితే.. కొన్ని ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏర్పడ్డాయి.. మరికొన్ని మానవ నిర్మితాలు. అలాంటి నిర్మాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది సాల్డ్‌తో నిర్మించిన ఈ హోటల్. సాధారణంగా నిర్మాణాలను మట్టి, డంగు సున్నం.. సిమెంట్‌తో కడతారు. ఈ హోటల్‌ను మాత్రం పూర్తిగా ఉప్పుతో నిర్మించారు. మరి ఈ వింతైన హోటల్ ఎక్కడుంది? దీని ప్రత్యేకతలు ఏంటన్నది తెలుసుకుందాం.
బోలివియాలో నిర్మాణం..
సాల్ట్‌తో నిర్మించిన ఈ హోటల్.. బొలీవియాలో ఉంది. హోటల్ అంటే కాస్ట్‌లీగా ఉంటే సరిపోదు, ఇలా డిఫరెంట్‌గా కూడా ఉండాలి అనుకున్నారేమో ఏకంగా నిర్మాణం మొత్తం ఉప్పుతో కట్టించి చూపరులను ఆకర్షిస్తున్నారు. గోడలు, పైకప్పు, మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతోనే కట్టించారు. ఉప్పు అంటే నీళ్లలో కరిగిపోతుంది కదా అని మీకు డౌట్ రావొచ్చు. కానీ అలా జరగకుండా పకడ్భందీగా నిర్మించారు. బొలీవియాలో ఉన్న ఎన్నో పర్యాటక ఆకర్షణ ప్రదేశాల్లో ఈ హోటల్ కూడా ఒకటి. దీనిపేరు ‘పాలాసియో డి సాల్’
సకల సౌకర్యాలు..
పాలాసియో డి సాల్ హోటల్‌లో 12 గదులు, డైనింగ్ హాల్స్, గోల్ఫ్‌కోర్స్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా ఉప్పు తోనే తయారు చేశారు. దీంతో హోటల్ మొత్తం తెల్లగా మెరుస్తూ చూపరులను కనువిందు చేస్తుంది.
సాల్ట్ బ్రిక్స్.. ఫైబర్ కోటెడ్..
ఇక ఉప్పు కరిగి పోకుండా ఎలా ఉంటుంది అనేగా అందని డౌట్.. ఇందుకోసం నిర్మాణ సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది. మొదట ఉప్పుతో ఇటుకలు తయారు చేయించింది. నీరు తగలగానే కరిగిపోయే స్వభావం ఉన్న ఈ ఇటుకలు కరగకుండా ఉండేందుకు ప్రతీ ఇటుకను ఫైబర్‌గ్లాస్‌తో ప్యాక్ చేశారు. దీనివల్ల లోపలికి గాలి, నీరు చొరబడదు. డిఫరెంట్ థీమ్‌తో ఉన్న ఈ హోటల్‌ను చూసేందుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది.