
Rajamouli- HCA Awards: రాజమౌళి సిగలో నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ కు వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) నుంచి ఐదింటిని సొంతం చేసుకుంది. హెచ్ సీఏ ప్రకటించిన బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది. వీటితో పాటు ‘హెచ్ సీఏ స్పాట్ లైట్’ ను ఆర్ఆర్ఆర్ దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభా ముఖంగా తెలియజేస్తూ నాదొక విన్నపం అంటూ మాట్లాడారు. ఇకపై అవార్డుల జాబితాలో స్టంట్ కొరియోగ్రాఫర్స్ విభాగాన్నికూడా చేర్చాలని కోరుతున్నానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ మా సినిమా కోసం స్టంట్ కొరియోగ్రాఫీ చేసిన సాల్మాన్, యాక్షన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన జూజీలు మాకు అనుగుణంగా పనిచేశారు. వీరితో పాటు ఇతర స్టంట్స్ మాస్టర్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. సినిమా ప్రేక్షకులను అలరించడం కోసం స్టంట్ మాస్టర్లు ఎంతో కష్టపడుతుంటారు. వారు చేసే ఫీట్ల వల్ల సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాల్లో స్టంట్ మాస్టర్స్ సేవలు ఎక్కువగా ఉపయోగించుకున్నాం. అందువల్ల ఈ సభా ముఖంగా తెలియజేస్తూ వారికి కూడా ప్రతిష్టాత్మక అవార్డులను అందజేయాలని కోరుతున్నా.. అని రాజమౌళి అన్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 320 రోజుల పాటు చిత్రీకరించామని, ఇందులో ఎక్కువ భాగం స్టంట్స్ కోసమే పనిచేశామన్నారు. వారందరికీ మా చిత్ర బృందం తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. దాదాపు 600 మంది బృందంతో పనిచేసి ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. మేం పడ్డ శ్రమను గుర్తించిన హెసీఏ కు థ్యాంక్స్ అని అన్నారు. ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సందర్భంగా ‘నాటు నాటు’ సాంగ్ వినిపిస్తూ హెచ్ సీఏ కు ధన్యవాదాలు అని తెలిపారు.
ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. మార్చి 12న ‘నాటు నాటు’కు అవార్డు రాకపై భారతీయ సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ తో పాటు ఎన్టీఆర్, రాంచరణ్ ల యాక్టింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కాగా ఇటీవల తారకరత్న మరణించిన నేపథ్యంలో ఈ అవార్డు కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కాలేదు.