
Pawan Kalyan- ABN RK: మిగతా వార్తలేమో గాని.. ఓ ప్రధాన పత్రికలో ఇన్వెస్టిగేషన్ చేసిన ఐటం బ్యానర్ స్టోరీగా వేసినప్పుడు, అది కూడా తాటి కాయంత అక్షరాలతో అచ్చు వేసినప్పుడు కచ్చితంగా ఫాలోఅప్ ఉంటుంది. లేకుంటే పాఠకుల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. మొన్న ఆంధ్రజ్యోతి పేపర్ లో ఆ సంస్థ ఎండి వేమూరి రాధాకృష్ణ బై లైన్ తో పవన్ కు కేసీఆర్ 1000 కోట్ల ఆఫర్ ఇచ్చాడు అంటూ ఒక సెన్సేషనల్ ఐటం అచ్చయింది.. సహజంగానే ఈ వార్త ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. కానీ తర్వాత దీనికి సంబంధించి ఫాలో అప్ కథనం రాలేదు.
కౌంటర్ గట్టిగా పడిందా
అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు టికెట్లు అమ్ముకున్నారంటూ రాధాకృష్ణ రాసుకొచ్చాడు. అంతేకాదు లేనిపోని ఆరోపణలు చేశాడు.. టిడిపి విజయానికి ప్రజారాజ్యం పార్టీ అడ్డుపడిందని ఆరోపించాడు. దీనిపై చిరంజీవి మౌనంగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఊరుకోలేదు. అప్పటి ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ రంగయ్య, నెట్వర్క్ ఇన్చార్జి అన్నమనేని శ్రీరామ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి చిల్లర మల్లన వార్తలు రాసి పరువు తీసుకోకండి అంటూ హితవు పలికాడు. ఇక ఆ తర్వాత రాధాకృష్ణ మెగాస్టార్ కుటుంబం జోలికి రాలేదు. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. తర్వాత కేంద్ర మంత్రి అయ్యాడు. అప్పటికి ఈ విషయాన్ని మళ్ళీ గెలుకు దామని రాధా కృష్ణ ప్రయత్నం చేస్తే… పవన్ ఇన్ డైరెక్ట్ గా హెచ్చరించాడు. దీంతో సైలెంట్ అయిపోయాడు.. పవన్ కూడా తన సినిమాల్లో బిజీగా మారిపోయాడు. తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం, చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేలా చేయడం.. ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి.. కానీ ఎప్పుడైతే రాజధాని రైతుల గురించి చంద్రబాబు పోరాటం మొదలు పెట్టాడు అప్పుడే రాధాకృష్ణ మళ్లీ యు టర్న్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ పై మళ్లీ తన పత్రికలో రాతలు రాయడం మొదలుపెట్టాడు.. కానీ దీనిని పవన్ అంతగా సీరియస్ గా తీసుకోలేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ వేయికోట్ల ఆఫర్ ఇచ్చాడని, మధ్యవర్తులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాపు నేతలని పంపించాడని తన పత్రికలో రాసుకొచ్చాడు.. దీనిపై పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తెర వెనుక మాత్రం రాధాకృష్ణకు హెచ్చరికలు జారీ చేశాడని తెలుస్తోంది. ముఖ్యంగా తనపై వ్యతిరేక వార్తలు రాయడం మానుకోవాలని చంద్రబాబు నాయుడు ద్వారా చెప్పించినట్టు తెలుస్తోంది. జగన్ మీద తాను పోరాటం చేస్తున్నానని, ఈ విషయాన్ని పక్కనపెట్టి తనమీద లేనిపోని ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాధాకృష్ణ అలాంటి వార్త రాయడం ద్వారా తనకు నష్టం జరుగుతుందని భావించిన చంద్రబాబు.. రంగంలోకి దిగాడని, రాధాకృష్ణను హెచ్చరించాడని సమాచారం. దీంతోనే మరుసటి రోజు దీనికి సంబంధించి ఫాలో అప్ స్టోరీ ఆంధ్రజ్యోతి పేపర్ లో రాలేదని సమాచారం. మరోవైపు టిడిపి నాయకులు కూడా ఆంధ్రజ్యోతి పేపర్ పై ఆగ్రహం గా ఉన్నట్టు తెలుస్తోంది.. 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నప్పుడు, తమ భాగస్వామి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వార్తలు రాయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు.. పాపం రాధాకృష్ణ.. 1000 కోట్ల వార్త ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తుందో?!