తారలు రాజకీయాలను ఏలడం ఇప్పటిది కాదు.. ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్.. నుంచి నేటి కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, పవన్, బాలయ్య, రోజాల వరకు అందరూ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న వారే. అయితే కొందరు హిట్ అయ్యారు. కొందరు ఫట్ అయ్యారు. ఇంకొందరు పోరాడుతున్నారు. కానీ ప్రజాదరణ మాత్రం తారలకు ప్రజలు కల్పిస్తూనే ఉన్నారు.
కోలీవుడ్ లో హీరోగా ఉన్న విశాల్ తెలుగులోనూ మార్కెట్ పెంచుకున్నారు. స్వతహాగా తెలుగువాడు అయిన విశాల్ అక్కడ చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విశాల్ నిర్మాతల సంఘం, నడిగర్ సంఘాల ఎన్నికల్లో పోటీచేసి అధ్యక్షుడిగా గెలిచాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేసి, చివరి క్షణంలో నామినేషన్‌ను ప్రతిపాదించిన పదిమందిలో కొందరు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో పోటీ చేయలేకపోయారు.
ఈసారి సీరియస్ గా పాలిటిక్స్ పై విశాల్ దృష్టిసారించాడు. ఈ మేరకు చెన్నైలోని ఒక నియోజకవర్గంలో పోటీచేయాలని విశాల్ నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై తన అభిమాన సంఘం నాయకులతో విశాల్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఏ నియోజకవర్గంలో పోటీ అన్నది త్వరలోనే తెలియనుంది.