Ravi Teja Waltair Veerayya: రోజుల వ్యవధిలో రవితేజ నుండి రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. డిసెంబర్ 23న ధమాకా విడుదలవుతుంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో ఫ్యాన్స్ ని పలకరించనున్నారు. ధమాకా విడుదల నేపథ్యంలో రవితేజ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో మీ రోల్ ఎలా ఉంటుందని మీడియా ప్రతినిధులు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా… వాల్తేరు వీరయ్య మూవీ నాకు చాలా స్పెషల్. చాలా ఏళ్ళ తర్వాత అన్నయ్య చిరంజీవితో నటించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి మూవీ చేయడం గొప్ప అనుభవం. కథ, కథనాలు చక్కగా కుదిరాయి.

వాల్తేరు వీరయ్య మూవీలో నా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. రేపు సంక్రాంతికి థియేటర్స్ లో చూసి నచ్చిందో లేదో మీరు చెప్పాలి, అని చెప్పుకొచ్చారు. రవితేజ మాటలు వాల్తేరు వీరయ్య చిత్రంపై అంచనాలు మరింతగా పెంచాయి. వాల్తేరు వీరయ్యలో రవితేజ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ సాగర్ రోల్ చేస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్ టీజర్ అద్భుతంగా ఉంది. సంకలో మేక పిల్లను పట్టుకొని వచ్చి రౌడీలను దుమ్ముదులపడం అదిరింది. తెలంగాణా మాండలికంలో రవితేజ చెప్పిన డైలాగ్ సరికొత్తగా ఉంది.
వాల్తేరు వీరయ్య స్టోరీ ఇదే అంటూ ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. వాల్తేరు వీరయ్య-విక్రమ్ సాగర్ సవతి తల్లులకు పుట్టిన అన్నదమ్ములని, వీరి మధ్య ప్రధాన సంఘర్షణ సాగుతుంది అంటున్నారు. ఇక 2000లో విడుదలైన అన్నయ్య మూవీలో రవితేజ చిరంజీవి తమ్ముడు పాత్ర చేశారు. అప్పటికి రవితేజ హీరోగా ఫేమ్ తెచ్చుకోలేదు. దాదాపు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఫ్యాన్స్ భారీ సక్సెస్ కొడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇక ధమాకా మూవీతో రవితేజ మ్యాజిక్ చేస్తారో నిరాశపరుస్తారో చూడాలి. ఆయన గత రెండు చిత్రాలు పరాజయం పొందాయి. దీంతో ధమాకా విజయం ఆయనకు చాలా కీలకం కానుంది. అదే సమయంలో రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ పై ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ చూసిన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి ఒక సినిమా అయినా చాలు, ఇలాంటి చెత్త సినిమాలు చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు.