BJP- BRS: రండి రండి రండి.. దయ చేయండి.. అంటూ తెలంగాణలో బీజేపీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈమేరకు ద్వారాలన్నీ తెరిచిపెట్టింది. ఈ క్రమంలో రెండు పార్టీలకు చెందిన కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున.. అప్పటి వరకు ప్రస్తుత పార్టీల్లోనే ఉండి.. ఎన్నికల వేళ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే.. బీజేపీతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీలో ఉత్సాహం..
తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ బలహీన పడి బీజేపీ బలపడుతూ వస్తోంది. టీఆర్‌ఎస్ కాస్త బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందింది. బీఆర్‌ఎస్‌కు తామే ప్రధాన ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు అంటున్నారు. రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మునుగోడులో ఓడినా టీఆర్‌ఎస్ అభ్యర్థికి చుక్కలు చూపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు మరికొన్ని పార్టీలు కూడా తెరపైకి వచ్చాయి. తెలంగాణలో టీడీపీ లేదనేవాళ్లకు ఖమ్మం సభే నిదర్శనమని బాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దింపేందుకు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు వైఎస్సార్‌టీపీ, బీఎస్పీ, జనసేన రంగంలోకి దిగనున్నాయి.
ఆపరేషన్ లోటస్..
మరోవైపు తెలంగాణలో సైలెంట్‌గా వర్క్ చేసుకుంటూ పోతున్న బీజేపీ వ్యూహకర్తలు అధికార పార్టీలో ఉన్న కొంతమందిని బీజేపీ కోవర్టులుగా మార్చారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంతో బీజేపీ తాజాగా వ్యూహం మార్చి.. గులాబీ నేతలతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీతో ఎమ్మెల్యేలతోపాటు, కొంతమంది మంత్రులు కూడా టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరు బీఆర్‌ఎస్ వ్యూహాలు, కేసీఆర్ స్ట్రాటజీ, ఎన్నికల ప్లాన్ గురించి ఎప్పటికప్పుడు బీజేపీ వ్యూహకర్తలకు సమాచారం చేరవేస్తున్నారని తెలుస్తోతోంది.

మొత్తంగా తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఆపరేషన్ లోటస్‌లో భాగంగా బీఆర్‌ఎస్ నేతలతోనే ఆ పార్టీని తెలంగాణలో పతనం చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందన్న రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.