
Ram Charan Ayyappa Deeksha: టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ వద్ద అక్కడి తెలుగువారు సందడి చేశారు. రాంచరణ్ తో కొందరు తెలుగువారు ఎగబడి ఫొటోలు దిగారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఇందులో రాంచరణ్ సూటుబూటులో అదిరిపోయాడు. వీటికి మెగా ఫ్యాన్స్ లైక్స్ కొడుతుండగా.. మరికొందరు ఆయనపై రకరకాల ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే.. అమెరికాకు వెళ్లేముందు రాంచరణ్ అయ్యప్ప మాలలో ఉండగా.. అక్కడికి వెళ్లిన తరువాత సూటుబూటులోకి ఎలా మారాడు? అని.. ఆయన అమెరికాకు వెళ్లేముందు, వెళ్లిన తరువాత ఉన్న రెండు ఫొటోలను కలిపి పోస్టు చేసి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆధ్యాత్యిక వాదులు ఈ పోస్టులపై రకరకాల కామెంట్స్ చేస్తుండగా..మెగా ఫ్యాన్స్ తమదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు. ఇంతకీ రాంచరణ్ ఇలా మారిపోవడానికి కారణమేంటి? అన్న చర్చ సాగుతున్న తరుణంలో ఆయన పీఆర్ టీం వివరణ ఇచ్చింది. అసలు కథేంటంటే?
న్యూయార్క్ లోని ఏబీసీ స్టూడియోలో నిర్వహిస్తున్న ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొనేందుకు రాంచరణ్ ఫిబ్రవరి 21న అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో రాంచరణ్ అయ్యప్ప మాల ధరించాడు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎయిర్ పోర్టులో కనిపించాడు. అయితే రెండు రోజుల తరువాత ఒక్కసారిగా సూటుబూటులో కనిపించాడు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు అయ్యప్ప మాలలో ఉన్న రాంచరణ్ సూటుబూటులోకి ఎలా మారాడు? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్ష విరమించకుండానే అమెరికా టాక్ షోలో పాల్గొన్నారా? లేక మధ్యలోనే మాల తీసేశారా? అని ప్రశ్నించారు.
దీంతో రాంచరణ్ పీఆర్ టీం వివరణ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి రాంచరణ్ అయ్యప్ప మాలలో వెళ్లిన విషయం వాస్తవమే. కానీ న్యూయార్క్ వెళ్లిన తరువాత అక్కడ ఓ ఆలయంలో దీక్ష విరమించాడు. 21 రోజుల పాటు దీక్ష చేసిన రాంచరణ్ గడువు పూర్తికావడంతో మాల విరమణ చేశాడని చెప్పారు. అయితే కొంతమంది అయ్యప్ప దీక్ష 41 రోజులు ఉంటుంది గదా? అని ప్రశ్నించారు. దీక్ష మధ్యలో ఎలా విరమిస్తారు? అని ప్రశ్నించారు. దీనిపైనా వివరణ ఇచ్చారు. రాంచరణ్ ఏడాదిలో మూడు, నాలుగు సార్లు మాల వేసుకుంటారు. ఆ మాత్రం తెలియదా? ఇప్పుడు 21 రోజుల దీక్ష కూడా చేస్తున్నారు అని రిప్లై ఇచ్చారు.

ఇక ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో షోలో పాల్గొన్న తొలి సౌత్ ఇండియన్ హీరో రాంచరణ్ అవడం విశేషం. ఈ సందర్భంగా రాంచరణ్ ను కలుసుకునేందుకు తెలుగువారు అక్కడికి వచ్చారు. ఆయనతో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. షో లో పాల్గొన్న యంగ్ హీరో చాలా బాగా మాట్లాడారని అందరూ ప్రశంసిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడం ద్వారా రాంచరణ్ కు వరల్డ్ వైడ్ గా క్రేజీ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయనకు అమెరికా టాక్ షో లో పాల్గొనేందుకు అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.