Rajinikanth Birthday: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్…. శివాజీరావ్ గైక్వాడ్ టు రజినీకాంత్. ఆయన తొలి అడుగు అతి సామాన్యంగా మొదలై ప్రభంజమైంది. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్ రజినీకాంత్ నట ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. మిత్రుడు సలహా మేరకు ఉద్యోగం వదిలి సినిమా బాట పట్టారు రజినీకాంత్. నటనలో శిక్షణ తీసుకునేందుకు రజినీకాంత్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. ఎగ్జామినర్ గా ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్లిన దర్శకుడు కే బాలచందర్ కంట్లో పట్టాడు రజినీకాంత్. నల్లగా ఉండే రజినీకాంత్ ముఖంలో ప్రేక్షకులను సమ్మోహనపరచగల మాయ ఉందని కే బాలచందర్ గుర్తించాడు.
1975లో విడుదలైన అపూర్వ రాగంగళ్ మూవీతో వెండితెరకు రజినీకాంత్ ని కే బాలచందర్ పరిచయం చేశాడు. పరిశ్రమలో నిలదొక్కుకునే క్రమంలో అనేక విలక్షణ పాత్రలు చేశారు. విలన్ గా కూడా నటించారు. హీరోగా బ్రేక్ వచ్చాక రజినీకాంత్ కి ఎదురు లేకుండా పోయింది. కమల్ హాసన్-రజినీకాంత్ కోలీవుడ్ కి రెండు కళ్ళయ్యారు. కమర్షియల్ హీరోగా ఎదిగిన రజినీకాంత్ కోలీవుడ్ ప్రేక్షకుల దైవం అయ్యాడు.
రజినీకాంత్ అంటే స్టైల్, తిరుగులేని హీరోయిజం, గూస్ బంప్స్ కలిగించే డైలాగ్ డెలివరీ… మాస్ హీరో అంటే రజినీకాంతే. వరుస హిట్స్, రికార్డుల మీద రికార్డులతో కోలీవుడ్ నుండి సౌత్… సౌత్ నుండి నార్త్… నార్త్ నుండి గ్లోబల్ సినిమాకు ఆయన కీర్తి వ్యాపించింది. జపాన్ లో అక్కడి స్టార్స్ తో సమానమైన స్టార్డం సొంతం చేసుకున్న హీరో రజినీకాంత్. ఎప్పుడో 1995లో ముత్తు సినిమాతో రజినీకాంత్ నెలకొల్పిన రికార్డు ఇన్నేళ్లకు ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేయగలిగింది. బాహుబలి 1, 2 వచ్చే వరకు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నీ రజినీకాంత్ పేరునే ఉన్నాయి.
వెండితెర వేలుపుగా వెలుగొందుతున్న రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. రజినీకాంత్ సీఎం సీటు అధిరోహిస్తే చూడాలని అభిమానుల చిరకాల కోరిక. 2017లో రజినీకాంత్ పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. రజినీ మక్కల్ మండ్రమ్(RMM ) పేరుతో పార్టీ ప్రకటన కూడా చేశారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు రజినీకాంత్ తన నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రకటించి అభిమానుల గుండెల్లో బాంబు పేల్చాడు. జీవితం సినిమాలకే అంకితం దేవుని ఆదేశంతో రాజకీయాల్లోకి రాకూడని నిర్ణయించుకున్నాని వెల్లడించారు.
అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఇంటి ముందు బైఠాయించారు. అయినా రజనీకాంత్ నిర్ణయం మార్చుకోలేదు. ఇది రజినీకాంత్ అభిమానులకు అతిపెద్ద నిరాశగా మిగిలిపోయింది. ఎన్ని కోట్లు ఉన్నా రజినీకాంత్ నిరాడంబర జీవితం కోరుకుంటారు. తన సంపాదనలో సగ భాగం సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తారు. దైవ చింతన ఎక్కువ. మహావతార్ బాబాజీని అమితంగా ఆరాధిస్తారు. జీవితంలో ఎనలేని కీర్తి, సంపద, గౌరవం, ప్రేమాభిమానాలు, ఫ్యామిలీ రిలేషన్స్… అన్నీ చూసిన రజినీకాంత్ చివరి కోరిక హిమాలయాల్లో శేష జీవితం గడపడం. అన్నీ త్యజించి అక్కడకు వెళ్లిపోవాలని రజినీకాంత్ చివరి కోరికగా ఉంది.