పబ్లిక్ టాయిలెట్స్… ఈ పేరు వింటేనే చాలామంది అదోలా భావిస్తారు. చాలామంది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ ను ఆశ్రయిస్తారు. పబ్లిక్ టాయిలెట్స్ లోని పరిశుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవసరాన్ని బట్టి ఏదో ఒక సందర్భంలో పబ్లిక్ టాయిలెట్స్ ను ఆశ్రయించే ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకు లోపల ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది.
అయితే ఈ సమస్యలకు పరిష్కారంగా జపాన్ లోని షిబుయా జిల్లా అధికారులు ఒక సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా వాళ్లు ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పారదర్శక గాజుతో మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా ఏర్పాట్లు చేశారు. యోయోగి ఫుకామాచి మినీ పార్క్, హారు-నో-ఒగావా కమ్యూనిటీ పార్కులలో షిగెరు బాన్ ఆర్కిటెక్ట్స్ ఈ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.
పారదర్శక గోడలతో నిర్మించిన టాయిలెట్లకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పారదర్శక గాజుతో నిర్మించిన టాయిలెట్ల ద్వారా లోపల ఎవరైనా ఉన్నారో లేదో సులభంగా తెలియడంతో పాటు టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయో
లేదో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా లోపలికెల్లి తలుపు వేసుకుంటే మాత్రం ఆపారదర్శకంగా కనిపించేలా అర్కిటెక్ట్స్ ఏర్పాట్లు చేశారు. లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టకపోతే మాత్రం అంతే సంగతి. టోక్యో టాయిలెట్స్ ప్రాజెక్ట్స్ వెబ్‌సైట్‌లో పారదర్శక మరుగుదొడ్లు పార్కుకే అందాన్ని తెస్తున్నాయని పేర్కొన్నారు.