
Boya Valmikis Protest: వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి ఈ మధ్య రివర్స్ అవుతున్నాయి. ఓట్లు రాబట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అటువంటి నిర్ణయమే జగన్ కు ఇప్పుడు తలనొప్పిగా మారింది. కులాల వారీగా విడగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఆయనకు ఇప్పుడు ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చడాన్ని తప్పుబడుతూ ఆదివాసీలు పెద్ద ఎత్తు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా వారికి జతవడంతో ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ బోయ, వాల్మీకీలు వెనుబడి ఉన్నారని వారిని ఎస్టీల్లో చేర్చాలనే అభ్యర్థనపై సరేనని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా, అమలు దాల్చడకపోవడంపై పలుమార్లు ఆయా సంఘాల నేతలు వినతులు అందజేశారు. సరిగ్గా ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోయ, వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీర్మానం చేశారు. దీనిపై ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్న, ఆదివాసీలు మాత్రం మండిపడుతున్నారు.
ఉత్తరాంధ్ర లో ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువ. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వసతుల్లేవు. విద్య విషయంలో వెనుకబడి ఉన్నారు. సరైన వైద్య సదుపాయాలు కూడా అందని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తమ అభ్యున్నతిని పట్టించుకోకుండా, అభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఏకపక్ష నిర్ణయలు ఎలా తీసుకుంటారంటూ మండిపడుతున్నారు. నిజమైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. 40 లక్షల మంది ఉన్న బోయ వాల్మీకులను ఎస్టీల్లో చేరిస్తే ఇప్పటికే ఉన్న గిరిజన తెగలు తీవ్ర అన్యాయానికి గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివాసీలు చేస్తున్న ఆందోళనల్లో టీడీపీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతున్నారు. ఉత్తరాంధ్రంలో గిరిజనుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ బాగా తగులుతుంది. ఏ కార్యక్రమం తలపెట్టినా భారీగా పోలీసుల సాయాన్ని తీసుకుంటున్నారు. ఎన్నికల సీజన్‌లో జగన్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి భారీగా నష్టం చేకూర్చే సూచనలు కనబడుతున్నాయి. వెరసి ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా మారుతుందనే ప్రచారం జరుగుతోంది.