
PM Modi- Operation Dost: భారీ భూకంపంతో విలవిలలాడిన టర్కీ, సిరియా దేశాల్లోల 45 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో టర్కీ సిరియా దేశాలకు 70పైగా దేశాలు తమవంతు సాయం చేశాయి. భూకంప బాధిత దేశాలకు భారత్ కూడా తనవంతు చేయూత అందించింది. టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు అందించేందుకు ఆపరేషన్ దోస్త్ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్ నుంచి రెస్క్యూ, మెడికల్ బృందాలను పంపింది. ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత ఆర్మీ వైద్య బృందం సహాయక చర్యలు ముగియడంతో భూకంప బాధిత దేశం టర్కీ నుంచి తిరిగి వచ్చింది.
టర్కీ ప్రభుత్వం కితాబు..
ఆపత్కాలంలో తక్షణసాయం చేసిన భారత ప్రభుత్వానికి, భూకంప బాధితులను కాపాడేందుకు రెస్క్యూ, ఆర్మీ బృందాలు చేసిన సహాయాన్ని టర్కీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. క్షతగాత్రుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేసి వందల మందికి చికిత్స అందించినందుకు అభినందించింది. చికిత్స పొందినవారు, రెస్యూ్య బృందాల సహాయంతో శిథిలాల నుంచి బయటపడిన వారు రెస్క్యూ బృందాలకు, జవాన్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఆత్మీయంగా హత్తుకున్నారు. సుమారు 15 రోజులు నిర్వహించిన ఆపరేషన్ దోస్త్ పూర్తి కావడంతో భారత్ బయల్దేరిన రెస్కూ, ఆర్మీ బృందాలకు చప్పట్లుల కొడుతూ సాగనంపారు. ఫిబ్రవరి 7న భూకంప ప్రభావిత దేశానికి సహాయ సహకారాలు అందించాలన్న ప్రధాని మోదీ ఆదేశాల మేరకు మొత్తం మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను, రెండు ఆర్మీ బృందాలను అక్కడికి పంపారు. 151 మందితో కూడిన బృందాలు, డాగ్ స్క్వాడ్‌లతో టర్కీ, సిరియాలో సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

ప్రధాని మోదీ ప్రశంస..
భూకంపం సంభవించిన టర్కీయేలో మోహరించిన భారతీయ విపత్తు సహాయక బృందాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సంభాషించారు. వారు పనిని సక్సెస్ చేయడంతో ప్రధాని వారిని ప్రశంసించారు. టర్కీ, సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’లో పాల్గొన్న సిబ్బందితో తాను సంభాషించానని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు. విపత్తు సహాయక చర్యలలో వారి కృషి అభినందనీయమని ఆయన అన్నారు. ‘మేము ప్రపంచాన్ని ఒక కుటుంబంగా పరిగణిస్తున్నాము, సంక్షోభంలో ఉన్న సభ్యునికి సహాయం చేయడం మా కర్తవ్యంగా చూస్తాం’ అని ఆపరేషన్ దోస్త్‌లో పాల్గొన్న బృందాలకు ప్రధాని మోదీ చెప్పారు ‘మీరు మానవాళికి గొప్ప సేవ చేశారు, భారతదేశం గర్వపడేలా చేశారు’ అంటూ వారిలో ఉత్సాహం నింపారు. ప్రపంచంలోని అత్యుత్తమ సహాయ మరియు రెస్క్యూ టీమ్‌గా మన గుర్తింపును మనం బలోపేతం చేసుకోవాలి, అని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ సిబ్బంది, ఇతర సంస్థలకు తెలిపారు.