
Operation Dost: ‘మానవ సేవయే, మాధవ సేవ’ నినాదాన్ని స్ఫూర్తిదాయకంగా అమలు చేస్తున్న భారత సైన్యంపై టర్కీ భూకంప బాధితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో వచ్చి ఆదుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. సైనికులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ముద్దాడి మరీ తమ కృతజ్ఞతను ప్రకటిస్తున్నారు. భూకంపాలు సంభవించిన కొద్ది గంటల్లోనే ఆపన్న హస్తం అందజేసినందుకు సంతోషిస్తున్నారు.
‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో
భూకంపాలతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు ప్రపంచదేశాలు సాయం చేస్తున్నాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 45 వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్.. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట సహాయక చర్యలు అందిస్తోంది. ఇందులో భాగంగా ఏడు భారీ విమానాల్లో ఆహారం, మందులు, ఆసుపత్రి పరికరాలు, సహాయక బృందాలు, జాగిలాలను పంపించింది. మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, భారత సైన్యానికి చెందిన రెండు బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. సైన్యం బృందాలు హటే పట్టణంలో ఫీల్డ్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులకు నిరంతరం వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి.
సైనికురాలిని హత్తుకుని..
ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫొటో ఒకటి షేర్ చేసింది. కృతజ్ఞతతో కూడిన టర్కిష్ మహిళ.. సహాయక చర్యల్లో ఉన్న భారత మహిళా సైనికురాలిని హత్తుకుని.. ముద్దు పెట్టింది. ఈ ఫొటో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ ‘వి కేర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆర్మీ చేస్తున్న కృషిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
థాంక్యూ హిందుస్థాన్ అంటూ..
టర్కీలోని హటాయ్ వద్ద భారత సైన్యం ఓ ఫీల్డ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. దీనిని ఆరు గంటల వ్యవధిలోనే నిర్మించింది. 96 మంది భారత సైనిక సిబ్బంది ఇక్కడ నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ యదువీర్ సింగ్ మాట్లాడుతూ తాము 800 మందికి చికిత్స చేశామని తెలిపారు. అవసరమైనంత వరకు తాము వైద్య సేవలను అందిస్తామన్నారు. ఈ ఆసుపత్రి సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదర్శ్ మాట్లాడుతూ, ఇక్కడ 10 ముఖ్యమైన శస్త్ర చికిత్సలు జరిగాయని తెలిపారు. ఈ సేవలను అందుకుంటున్న ప్రజలు భారత సైన్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక్కడ చికిత్స చేయించుకున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ, ‘థాంక్యూ హిందుస్థాన్’ అని చెప్పారు. స్థానికులు మాట్లాడుతూ, భారత సైన్యం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వారు ఇక్కడికి రావడం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.

చప్పట్లు కొడుతూ..
భారత సైన్యం సేలను టర్కీవాసులు ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టిన వీడియోను ఆర్మీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. హటే పట్టణంలోని ఇస్కెండెరున్‌లోని ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో సుమారు 15 రోజులు క్షతగాత్రులకు వైద్యం అందించారు. ఇటీవల ఆస్పత్రిలో సేవలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా అక్కడ చికిత్స పొందిన వారు ఆర్మీకి కృతజ్ఞతలు తెలుసుతూ చప్పట్లు కొడుతూ సాగనంపారు.