
TSPSC Paper Leak Praveen: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. మొన్నటి దాకా ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ తాజాగా తేలింది ఏంటయ్యా అంటే అసలు ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షే రాయలేదట! ఈ విషయం చెప్పింది ఎవరో కాదు స్వయంగా అతడే! సిట్ దర్యాప్తులో అతడు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో ఈ వ్యవహారం మరింత జటిలమైంది. ఫలితంగా ఈ తతంగం ఇంకా ఎంత దూరం వెళ్తుందోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నిందితుల విచారణ పూర్తయింది. ఆదివారం నిర్వహించిన విచారణ సాంకేతిక అంశాల చుట్టూ తిరిగింది. నిందితులు ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన విధానాన్ని సిట్ అధికారులు సాంకేతికంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. దీనికోసం వారిని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలాయానికి తీసుకెళ్లారు. వారు ఉపయోగించిన టెక్నాలజీని తెలుసుకున్నారు. నిందితులు చెప్పిన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ప్రవీణ్, రాజశేఖర్ టీఎస్ పీఎస్సీలోని రహస్య విభాగంలోకి ఎలా వెళ్లారు? ఎలా, ఎవరి అనుమతి తీసుకున్నారు? అక్కడి నుంచి ప్రశ్నపత్రాలు ఎలా తీసుకోగలిగారనే కోణంలో అధికారులు విచారిం చినట్టు తెలుస్తోంది. రాజశేఖర్‌కున్న సాంకేతిక పరిజ్ఞానం, ఎంతకాలంగా నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు, టీఎ్‌సపీస్సీలోని కంప్యూటర్లపై అతడికి తెలిసిన సమాచారం తదితర అంశాలపై ప్రశ్నించారు.

రాజశేఖర్, ప్రవీణ్‌లకు కమిషన్‌లో ఉన్న కంప్యూటర్ల ఐపీ అడ్రస్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎలా తెలిశాయి, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని శంకరలక్ష్మి కంప్యూటర్ ఐపీ అడ్ర్‌సను ఎలా మార్చగలిగారు, అందులో ఉన్న సమాచారాన్ని పెన్ డ్రైవ్‌లోకి ఎలా పంపారు, శంకరలక్ష్మికి అనుమానం రాకుండా కంప్యూటర్‌ను ఎలా కంట్రోల్ చేయగలిగారనే సాంకేతిక అంశాలపై విచారణ చేశారు. పేపర్ లీకేజీలో ఇతరుల ప్రమేయానికి సంబంధించి ప్రశ్నించారు. ఎటువంటి అనుమానం రాకుండా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎలా తీసుకోగలిగారు. వాటి సాయంతో ఎన్ని ప్రశ్నపత్రాలు తీసుకున్నారు, ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో కూడా అధికారులు విచారణ చేశారు. ప్రవీణ్, రాజశేఖర్‌తో పాటు ఇతర నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు, వారి కాల్‌డాటాపై దృష్టి పెట్టారు. ఆ ఫోన్ల లో ఉన్న కాంటాక్టుల గురించి కూపీ లాగుతున్నారు. వారిలో ఎవరైనా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలు రాశారా, రాస్తే ఎన్ని మార్కులు వచ్చాయన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

గ్రూప్-1 పరీక్ష రాయలేదు: ప్రవీణ్
ఈ వ్యవహారంలో సూత్రధారి ప్రవీణ్ తాను గ్రూప్-1 పరీక్ష రాయలేదని విచారణలో సిట్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్ అరెస్టయిన అనంతరం సోషల్ మీడియాలో అతను రాసినదంటూ చక్కర్లు కొట్టిన గ్రూప్-1 పరీక్ష ఓఎంఆర్ షీట్ ఎవరిదనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అతడికి పరీక్షలో 103 మార్కులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓఎమ్‌ఆర్ షీట్ ఎవరది? ఎవరు పోస్ట్ చేశారు? అసలు ప్రవీణ్ చెబుతున్న దాంట్లో నిజం ఎంత? అతడితో ఎవరైనా ఇలా చెప్పిస్తున్నారా? అనే విషయాలు ఇప్పుడు సిట్ అధికారుల బుర్రలను హీట్ ఎక్కిస్తున్నాయి. దర్యాప్తు లోతుగా సాగితే కానీ అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి.