Homeజాతీయ వార్తలుKavitha- ED Inquiry: నేడు ఈడీ విచారణ: కవిత హాజరవుతారా?

Kavitha- ED Inquiry: నేడు ఈడీ విచారణ: కవిత హాజరవుతారా?

Kavitha- ED Inquiry
Kavitha- ED Inquiry

Kavitha- ED Inquiry: ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం విచారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భర్త అనిల్‌, సోదరుడు, మంత్రి కేటీఆర్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, పలువురు న్యాయవాదులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా తుగ్లక్‌ రోడ్డులోని తన తండ్రి, సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసానికి చేరుకున్నారు. విచారణలో ఏ ప్రశ్నలు అడుగుతారు? సమాధానాలు ఏం చెప్పాలి? అసలు విచారణకు హాజరు కాకపోతే పరిస్థితి ఏంటి? అనే అంశాలపై రాత్రి వీరంతా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీంతో విచారణకు కవిత హాజరవుతారా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఈనెల 11న మొదటిసారి ఈడీ విచారణకు హాజరైన కవిత రెండోసారి ఈ నెల 16న గైర్హాజరైన విషయం తెలిసిందే. ఆ రోజు కూడా ఢిల్లీకి వచ్చినా.. ఈడీ విచారణకు హాజరుకాకుండా తన తరఫు న్యాయవాదిని పంపించారు. తాను ప్రత్యక్షంగా హాజరు కావాలా? లేదంటే ప్రతినిధులను పంపాలా? అనే విషయంపై నోటీసుల్లో స్పష్టత లేదంటూ ఈడీకి ఆమె లేఖ రాశారు. ఈ లేఖను సోమా భరత్‌ నేతృత్వంలోని న్యాయనిపుణులు ఈడీ అధికారులకు అదే రోజు అందజేశారు. ఆ తర్వాత ఈ నెల 20న విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాలని మరోసారి ఈడీ ఆదేశించింది. అయితే తాను మహిళను అయినందున తనను ఇంటి వద్ద విచారించాలంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ 24న విచారణకు రానుండగా.. ఆ తర్వాతే విచారణకు హాజరవుతానని ఈడీకి విన్నవించుకున్నారు. కానీ, ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు.

సుప్రీం నిరాకరించడంతో..

ఈడీ అధికారులు తన అభ్యర్థనను తోసిపుచ్చడం, ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో.. తన పిటిషన్‌పై ఈలోపే విచారణ చేపట్టాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. అయితే పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన రోజే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సీజేఐ ధర్మాసనం తక్షణమే విచారించేందుకూ నిరాకరించింది.. ఈ నెల 24నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈలోగా ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో కేవీయట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమ వాదన వినకుండా తీర్పు ఇవ్వవద్దని కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ విచారణకు కవిత హాజరవుతారా? విచారణను ఎదుర్కొనకుండా.. న్యాయనిపుణుల ద్వారా ఇంకా ఏదైనా మార్గాలను అనుసరిస్తారా? అన్నది సోమవారం వెల్లడి కానుంది. కానీ, కవిత విచారణ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నుంచి మారుమూల పల్లె వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలంతా హస్తిన వైపే దృష్టి పెట్టారు.

Kavitha- ED Inquiry
Kavitha- ED Inquiry

మరోసారి అవెన్యూ కోర్టులో..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మరోసారి రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నెల 16న పిళ్లై కస్టడీని మూడు రోజులపాటు పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో ఆయనను సోమవారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకురానున్నారు. అయితే పిళ్లై కస్టడీని మరోసారి పొడిగించాలంటూ ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular