
Paper Leak Prevention Bill Telangana: ఉదయం లేస్తే కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా గుజరాత్ రాష్ట్రాన్ని తిడతారు. గుజరాత్ రాష్ట్రంలో పుట్టి ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీని తిడతారు. కానీ ఈ కష్టకాలంలో భారత రాష్ట్రసమితి నాయకులకు గుజరాత్ ఆశాదీపంలా కన్పిస్తోంది. ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినా, ఆ నమస్తే రాయక పోయినా ప్రభుత్వ పెద్దల మనసు గుజరాత్ చుట్టే తిరుగుతున్నది. టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. వాటిని అరికట్టేందుకు కఠిన చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న చట్టాలను అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా గుజరాత్ రాష్ట్రం ఇటీవల (ఈ నెల 3న) తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ చట్టంలో కఠిన శిక్షలను అక్కడి ప్రభుత్వం నిర్దేశించింది. ముఖ్యంగా పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1 కోటి వరకు జరిమానా విధిస్తారు. వారికి చెందిన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తారు. ఇంకా కొన్ని అంశాలను తీసుకుని కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా రాష్ట్ర అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

లీకేజీకి పాల్పడినవారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలుశిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధిస్తారు. నేరస్తుల స్థిర, చర ఆస్తులను జప్తు చేసే అధికారం ఉంటుంది. లీకేజీకి ప్రయత్నించినా.. శిక్షించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఎంసెట్, ఐసెట్, ఇంటర్, టెన్త్ వంటి అన్ని పరీక్షల పేపర్ లీకేజీకీ ఈ చట్టం వర్తిస్తుంది. పేపర్ లీకేజీని ప్రోత్సహించినా, సహకరించినా, లీకైన పేపర్‌తో పరీక్ష రాసినా.. వారందరినీ నేరస్తులుగానే పరిగణిస్తారు. లీకైన పేపర్‌తో పరీక్ష రాసే అభ్యర్థులను రెండేళ్లపాటు పరీక్షల నుంచి డిబార్ చేస్తారు.

పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బందితోపాటు ప్రైవేటు భవనాల వినియోగం విషయంలో కొన్ని నిబంధనలను మార్చనున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కొన్ని పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్నారు ఇది అధికారులకు కొంత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రైవేట్ యాజమాన్యాలు తమకు ఇష్టమైతేనే పరీక్షకు సహకరిస్తున్నాయి. లేదంటే తమ మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. దీంతో పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సరైన సిబ్బంది లేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి అంశాల్లో ఎన్నికల నిర్వహణలో అమలు చేసే విధానాలను వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రైవేట్ మౌలిక సదుపాయాల ఉపయోగం నుంచి ప్రభుత్వ సిబ్బంది విధుల వరకు ఎన్నికల సంఘం ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.