
Ponguleti Srinivasa Reddy- YS Sharmila: తెలంగాణలో చక్రం తిప్పాలని భావిస్తున్న వైఎస్ షర్మిలకు ఆది లోనే ఎదురు దెబ్బ తగిలింది. తన పార్టీలో చేరుతాడని అనుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు.. నిన్న కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం ద్వారా తన లక్ష్యాలు వేరే ఉన్నాయని, రాజకీయంగా ప్రస్తుతానికి అయితే ఒంటరి పోరాటం చేస్తానని షర్మిలకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా షర్మిల పార్టీలో నై రాశ్యం నెలకొంది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా భారత రాష్ట్ర సమితికి వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఇతర భారత రాష్ట్ర సమితి నాయకులను నేరుగా విమర్శిస్తున్నారు.. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. పైగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉండటంతో ఆయన తన బలాన్ని మరింత పెంచుకున్నారు.
అయితే 2019 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు టికెట్ తనకు అధిష్టానం పై పొంగులేటి కొంచెం అసంతృప్తితో ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశపెట్టారు. తర్వాత ఎందుకనో ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోవడంతో పొంగులేటి తన దారి తన చూసుకున్నారు.. నూతన సంవత్సరం సందర్భంగా అధిష్టానం పై తిరుగుబాటు ప్రకటించారు. అంతే కాదు ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించారు. తన వర్గం వారిని బయటికి వెళ్లకుండా చూసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన జగన్ సోదరి షర్మిల, ఆమె తల్లి వైయస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ముగ్గురి మధ్య రాజకీయాలకు సంబంధించి తీవ్రమైన చర్చలు జరిగాయి. దీంతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి షర్మిల పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. తర్వాత ఏమైందో తెలియదు కానీ అది చప్పున చల్లారిపోయింది. అంతకుముందు కూడా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇందుకు పచ్చ జెండా ఊపారని ప్రచారం జరిగింది. తర్వాత అది కూడా గాలివాటం వార్తలాగానే తేలిపోయింది.

ఇక ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఇద్దరు కలిసి అధికార భారత రాష్ట్ర సమితి మీద తీవ్ర విమర్శలు చేశారు. బహుశా ఈ స్థాయి విమర్శలు కేసీఆర్ మీద ఎవరూ చేసి ఉండరు. అంతే కాదు వీరిద్దరూ కలిసి ప్రత్యేకంగా పార్టీ ఏమైనా పెడుతున్నారా అనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఈ సమావేశం తో తన రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉంటుందో పొంగులేటి స్పష్టం చేయడంతో షర్మిల పార్టీలో ఆయన చేరబోరు అని అర్థం అయిపోయింది. మరి పొంగులేటి తర్వాత స్టెప్ ఏంటో అంతు పట్టకుండా ఉంది.