
Namrata-Mahesh Babu: మహేష్ బాబు-నమ్రతల వివాహ బంధం 18వ ఏట అడుగు పెట్టింది. ఈ హ్యాపీ మూమెంట్ ని స్టార్ కపుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంత వరకు ఎవరూ చూడని ఓ రొమాంటిక్ పిక్ నమ్రత ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ’18 ఏళ్ల క్రితం మేము తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ యానివర్సరీ ఎంబీ..’ అని నమ్రత కామెంట్ చేశారు. ఇక నమ్రత పోస్ట్ చేసిన పిక్ చాలా రొమాంటిక్ గా ఉంది. సదరు పిక్ లో మహేష్ ని నమ్రత ముద్దుల్లో ముంచెత్తుతున్నారు. నమ్రత పోస్ట్ చేసిన ఈ అరుదైన పిక్ క్షణాల్లో వైరల్ గా మారింది. అభిమానులు మహేష్ దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. మీ అందమైన బంధం ఇలానే కలకాలం కొనసాగాలని కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ సైతం ఓ రొమాంటిక్ పిక్ పోస్ట్ చేశారు. ‘మనిద్దరం కలిస్తే కొంచెం పిచ్చి, అనంతమైన ప్రేమ. 18 ఏళ్ల మన బంధం శాశ్వతంగా నిలిచిపోనుంది, హ్యాపీ యానివర్సరీ నమత్రా…’ అని మహేష్ కామెంట్ చేశారు. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రత ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా మహేష్ పెళ్లి జరిగింది. మహేష్ పెళ్లి వార్త బ్రేకింగ్ న్యూస్ కాగా… అప్పట్లో చాలా మంది అమ్మాయిలు లేడీ దేవదాసులైపోయారు.
పెళ్ళయాక నమ్రత సినిమాలు మానేశారు. భర్తే ప్రపంచంగా బ్రతికారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు. గౌతమ్, సితార కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు నమ్రత ఇతర వ్యాపకాలు పెట్టుకోలేదు. వారికి మెచ్యూరిటీ రాగానే… మహేష్ ఆంతరంగిక సలహాదారు అయ్యారు. మహేష్ తీసుకునే పలు నిర్ణయాల్లో నమ్రత పాత్ర ఉంటుంది. ఆయన మొదలుపెట్టిన పలు వ్యాపారాల వెనుక నమ్రత ఐడియాలు ఉన్నాయి.

మహేష్ ఎదుగుదలలో నమ్రత పాత్ర ఎంతగానో ఉంది. ముంబైలో పుట్టిపెరిగిన నమ్రత మోడల్. ఆమె అనేక జాతీయ అంతర్జాతీయ బ్యూటీ కాంటెస్ట్స్ లో పాల్గొన్నారు. విజయాలు అందుకున్నారు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి ప్రేమ కోసం, భర్త కోసం ఒక్కసారిగా తన ప్రపంచానికి దూరం కావడం గొప్ప విషయం. పల్లెటూరు ఆడపిల్లలే టెక్కు చూపిస్తున్న రోజుల్లో నమ్రత పెళ్లి తర్వాత హౌస్ వైఫ్ గా మారిపోయారు. ఒకరికొకరు తోడుగా మహేష్-నమ్రత అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. ఇన్నేళ్లలో మహేష్, నమ్రత గొడవ పడినట్లు చిన్న పుకారు కూడా లేదు.