
Pawan Kalyan moved on Varahi: విజయవాడలోని అన్ని దారులు ఇప్పుడు మచిలీపట్నం వైపు దారితీస్తున్నాయి. మచిలీపట్టణంలో జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. సభాస్థలికి చేరుకునేందుకు పవన్ కల్యాణ్ బయల్దేరారు. అడుగడుగునా ఆయనకు ప్రజానీకం స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. రోడ్లన్నీ స్థంభించిపోయాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

సోమవారమే ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న ఆయన, ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై అగ్ర నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ రోజు మచిలీపట్టణంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్, పవన్ కల్యాణ్ రూట్ మ్యాప్ ను పార్టీ కార్యాలయం ముందుగానే విడుదల చేసింది. పోలీసుల ఆంక్షలు విధించి అడ్డుకోనున్నట్లు పుకార్లు వినిపించాయి.

ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, జనసైనికులు మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించలేదు. అనుకున్నట్లుగానే భారీగా ప్రజలు విజయవాడకు చేరుకున్నారు.మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయల్దేరిన జనసేనాని పవన్ ర్యాలీగా విజయవాడకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. దారిపొడవునా రోడ్డుకు అటు ఇటు వేచి ఉన్న వారందరికీ ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు.

జనసంద్రమైన విజయవాడలో జనసేనాని వారాహి వాహనాన్ని అధిరోహించారు. అక్కడ నుంచి సుమారు 40 కిలో మీటర్ల మేర జనసైనికులు ఆయన వెంట మచిలీపట్టణానికి కదిలారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సుల్లో, కార్లలో ప్రజలు సభా స్థలికి తరలివచ్చారు. షెడ్యూల్ ప్రకారం 5 గంటలకు మచిలీపట్నం సభకు చేరుకోవాల్సి ఉండగా, జన సందోహం మధ్య వారాహి వాహనం కదలడం కష్టంగా ఉండటంతో ఇంకొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది.