
Panipat: ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది.. ఇదంతా గతం.. ఇప్పుడు ప్రేమ ప్రాణాలు తీస్తుంది. అవసరమైతే ఎదుటి వారిని బలి కోరుతుంది. ప్రియుడి మోజులో పడి బంధాలను తెంచుకోమంటోంది. ఇందుకు హరియాణాలో జరిగిన తాజా ఘటనే ఉదాహరణ. ప్రియుడితో పారిపోయేందుకు.. పానీపత్లో ఓ ప్రేమకథ వెర్రితలలు వేసింది. చూడటానికి తనలాగే ఉన్న మరో యువతిని బలి తీసుకుంది.
ఆలస్యంగా వెలుగులోకి..
హరియాణా రాష్ట్రంలోని పానీపత్లో ఓ ప్రేమకథ వెర్రితలలు వేసింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పన్నాగం పన్నిన ప్రియురాలు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది. ఈ ఘటన 2017లో జరగగా.. ఇన్నేళ్లకు వాస్తవం బయటపడి ప్రియురాలికి శిక్ష పడింది. జ్యోతి, కృష్ణ కళాశాల రోజుల నుంచే ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి జ్యోతి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. జ్యోతిలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
టీవీ సీరియల్ చూసి..
ఓ టీవీ సీరియల్ ఆధారంగా యువతి హత్యకు పథకం రచించారు. 2017. సెప్టెంబర్ 5న.. జ్యోతి తన స్నేహితురాలు సిమ్రన్ను జీటీ రోడ్డుకు పిలిపించింది. ఆమె చేత మత్తు కలిపిన కూల్డ్రింక్ తాగించి, గొంతు కోసి చంపేశారు. సిమ్రన్ దుస్తులు మార్చి, ఆ స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి ప్రేమికులిద్దరూ ఉడాయించారు. పోలీసులు చూపిన సిమ్రన్ మృతదేహం జ్యోతిదే అని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

సిమ్రన్ మిస్సింగ్ కేసు..
మరోవైపు.. సిమ్రన్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో అదృశ్యం కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు.. యువతి హత్య తాలూకు ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు కూడా చూపించారు. మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా సిమ్రన్ అని గుర్తించారు. దీంతో జ్యోతి, కృష్ణలను వెదికే పనిలో పడ్డారు పోలీసులు. శిమ్లాలో వారిని గుర్తించి, 2020లో అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉండగా క్షయవ్యాధితో కృష్ణ జైలులోనే చనిపోయాడు. ఈ ఘటనపై మంగళవారం తీర్పు చెప్పిన పానిపత్ కోర్టు.. జ్యోతికి జీవితఖైదు విధించింది.
ప్రియుడితో కలిసి జీవించేందుకు ప్రియురాలు మరో యువతిని బలి తీసుకుంది. చివరకు పాపం పండింది. బండారం బయట పడింది. ప్రియుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ప్రియురాలు జైలుపాలైంది.