
Katari Krishna: కఠారి కృష్ణ.. ఈ పేరు చెప్పగానే ‘క్రాక్’ సినిమా గుర్తుకొస్తుంది. అడ్డొచ్చిన వ్యక్తిని అతి కిరాతకంగా చంపడం.. అడ్డూ అదుపు లేకుండా దందాలు చేయడం కఠారి కృష్ణ చేసే పని. ఈ సినిమాలో కఠారి కృష్ణ పాత్రలో సముద్రఖని నటించి ఆహా అనిపించారు. రియల్ గా ఇలాంటి క్రూర మనిషి ఉంటాడా? అనేంతలా మెప్పించారు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే రియల్ గా కఠారి కృష్ణ ఉన్నారు.
‘క్రాక్’ సినిమా తీసే ముందు ఆయన గురించి తెలిశాక గోపిచంద్ మలినేని కఠారి కృష్ణను కలుసుకున్నాడు. ఆయన చెప్పిన విషయాలను భట్టే ‘క్రాక్’ సినిమాలో కఠారి కృష్ణ పాత్రను పెట్టినట్లు డైరెక్టర్ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాకుండా రియల్ కఠారి కృష్ణ ఒకప్పుడు గొంతులు కోసేవాడని, కానీ ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడని చెప్పారు. మరి కఠారి కృష్ణ జీవితం అలా ఎందుకు మారింది? ఇంతకీ రియల్ కఠారి కృష్ణ స్టోరీ ఏంటి?
ఒంగోలు ప్రాంతంలో 1970 నుంచి 2000 సంవత్సరం వరకు కఠారి కృష్ణ పేరు వింటే జనాలు వణికిపోయేవారు. ఈయనది గోపాలపురం. మోటార్ ఫీల్డులో పనిచేస్తూ కొన్ని కారణాల వల్ల క్రైం బ్యాచ్ కు లీడర్ గా మారాడు. చిన్న చిన్న గొడవలను పెద్దదిగా చేస్తూ హత్యలకు ప్లాన్ చేసేవారట. ఇదే సమయంలో మరో గ్రూప్ లీడర్ చింతల నారాయణ, పిచ్చయ్య అనే వ్యక్తులపై హత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు చనిపోవడంతో ఇందులో ఇన్వాల్వ్ అయిన 14 మందికి జైలు శిక్ష పడింది. వీరిలో కఠారి కృష్ణ కూడా ఉన్నారు.

ఆ తరువాత జైలు నుంచి బయటకొచ్చిన తరువాత కఠారి కృష్ణ పేరు వింటేనే వణికేవారు. 1980లో బ్యాంక్ ఎన్నికల్లో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేసి జైలుకెళ్లారు. ఆ తరువాత బయటకొచ్చిన ఆయన పలు దందాలు నిర్వహించేవారు. సినిమాల్లో చూపినట్లుగానే కఠారి కృష్ణకు రెండో భార్య జయమ్మ ఉండేది. ఈమె హత్య జరిగిన తరువాత కఠారి రౌడియిజం తగ్గింది. ఆ తరువాత ఇతని మొదటి భార్య, కూతురు దూరమయ్యారు.
ఈ స్టోరీని కఠారి కృష్ణనే చెబుతు కన్నీళ్లు పెట్టుకున్నట్లు డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెలిపారు. జీవితంలో దందాలు, రౌడియిజం చేస్తే చివరికి మనకు తోడుగా ఎవరూ ఉండరని అయన చెప్పారట. ఒకప్పుడు దందాలు చేసి బిర్యానీ తిన్న ఆయన ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకుంటూ గంజినీళ్లు తాగుతున్నాడట. అయితే అప్పటి కంటే ఇప్పుడే ఎంతో తృప్తిగా ఉందని కఠారి కృష్ణ చెప్పినట్లు గోపిచంద్ మలినేని తెలిపారు.