Storms: మిగ్ జాం తుఫాను తమిళనాడు, ఏపీ లను కుదిపేస్తోంది. ప్రజా జీవనాన్ని కాకవికలం చేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు పై పెను ప్రభావం చూపుతోంది. ఈ తుఫాను సృష్టించిన విళయానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. నేడు తుఫాను ఏపీలో తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయ్యింది. ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ తాజా తుఫానుకు మిగ్ జాం అని మయన్మార్ సూచించడంతో ఆ పేరు పెట్టారు.
ఈ తుఫాను పేరుకు సంబంధించి బలం, పుంజుకునే శక్తి దాని అర్థమని మయన్మార్ ప్రకటించింది. భవిష్యత్తులో ఆ తుఫాను నష్టం గురించి చర్చించేందుకు, పరిశోధకులు అధ్యయనం చేసేందుకు సులువుగా ఉంటుంది. సాధారణంగా గంటకు కనీసం 61 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో సంభవించే తుఫానులకే పేరు పెడతారు. తుఫానులకు పేర్లు పెట్టే ప్రక్రియ 2000లో ప్రారంభమైంది. కానీ సుదీర్ఘ చర్చిల తర్వాత 2004లో తుఫాన్లకు పేరు పెట్టే ప్రక్రియ పూర్తిస్థాయిలో మొదలైంది.
ఆసియాలో ఏర్పడే తుఫాన్లకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంగా కలిగిన 13 దేశాలు ఈ పేర్లను నిర్ణయిస్తాయి. 2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ దేశాలు ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుఫాన్లకు ముందే పేర్లను నిర్ణయిస్తుంది. ఈ పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ కాగా, భారత్ ది రెండో పేరు. ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో పుట్టే తుఫానులకు పేర్లను భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటిస్తుంది.
అయితే సామాన్యులు సైతం ఈ తుఫానులకు పేరు పెట్టే అరుదైన అవకాశాన్ని భారత వాతావరణ శాఖ కల్పించింది. భారత్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో తుఫానులకు సామాన్య ప్రజలు పేరు సూచించవచ్చు. ఈ పేర్లు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎవరి మనోభావాలు గాయపడిన విధంగా, చిన్నగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసక్తి ఉన్నవారు ఢిల్లీలో ఉన్న భారత వాతావరణ శాఖకు లేఖ ద్వారా పేర్లను సూచించవచ్చు.