Operation Bhediya: జనంపైకి తోడేళ్ల దండయాత్ర.. నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ రాష్ట్ర గ్రామీణులు.. ఆపరేషన్‌ భేడియా స్టార్ట్

తోడేళ్లు.. కుక్కను పోలిన జంతువులే. కానీ కుక్కలకన్నా క్రూరమైనవి. అడవిలో ఉంటాయి. ఆహారం కోసం సామూహికంగా వేటాడుతుంటాయి. పులులు, చిరుత పులులపైనా దాడిచేసి చంపేస్తాయి. ఇలాంటి తోడేళ్లు మనుషులపైనా దాడి చేస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : August 31, 2024 5:12 pm

Operation Bhediya

Follow us on

Operation Bhediya: తోడేళ్లు అడవి జంతువులు.. జనావాసాలకు దూరంగా ఉంటాయి. అడవిలో క్రూరంగా ఉండే తోడేళ్లు జనాలను చూస్తే మాత్రం పారిపోతాయి. కానీ, ఇప్పుడు ఆ తోడేళ్లు కూడా ఆహారం కోసం జనావాసాలపై దండయాత్ర చేస్తున్నాయి. అంతరించిపోతున్న అడవులతో వన్యప్రాణులు జనావాసాల్లోవి వస్తున్నాయి. ఇప్పటికే కోతులు జనావాసాల్లోకి వచ్చేశాయి. వాటిని వాపస్‌ పంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. పరిస్థితులకు తగినట్లు కోతులు తమ తీరును మార్చుకుంటున్నాయి. ఇక ఏనుగులు, చిరుతలు, నక్కలు, జింకలు ఇలా చాలారకాల జంతువులు అడవుల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. జింకలు, ఏనుగులు, అడవి పందులు పంటలను ద్వంసం చేస్తున్నాయి. ఇక చిరుతలు, పులులు ఆవులు, మేకలు, గేదెలను చంపుతున్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా తోడేళ్లు కూడా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఏకంగా మనుషులనే చంపేస్తున్నాయి. తోడేళ్ల భయంతో 30 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

ఎక్కడ అంటే..
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లా వాసులను నెలన్నర రోజులుగా తోడేళ్లు వణికిస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. ఇప్పటివరకు 30 మంది గాయపడ్డారు. తోడేళ్ల భయంతో 30 గ్రామాల జనం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాత్రంతా కాపలా కాస్తున్నారు. ఇళ్లలో చిన్నారులను చీరలతో తమకు కట్టేసుకుని పడుకుంటున్నారు మహిళలు.

భయం గుప్పిట్లో పల్లెలు..
ఖరీఘాట్‌లోని ఛత్తర్‌పూర్‌లో మూడు, ఆరు, తొమ్మిదేళ్ల వయస్సున్న ముగ్గురు పిల్లలపై తోడేళ్లు దాడి చేయడంతో వారు గాయపడ్డారు. అలాగే తల్లిదండ్రులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్న ఐదేళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లి చంపి తిన్నాయి తోడేళ్లు. తోడేళ్ల హడల్‌తో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వరుస ఘటనలతో అప్రమత్తమైన బహ్రైచ్‌ జిల్లా కలెక్టర్‌ మోనికా రాణి..గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో పడుకోవద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు తోడేళ్ల దాడులను నియత్రించే ఆపరేషన్‌లో నాలుగు జిల్లాల డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారులు బిజీ అయిపోయారు. తోడేళ్ల గుంపు కదలికలను పర్యవేక్షించేందుకు హై ఫ్రీక్వెన్సీ డ్రోన్‌ కెమెరాలు వాడుతున్నారు. ఈ కెమెరాల్లో తోడేళ్లు సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రోన్ల సాయంతో ఇప్పటి వరకు ఏడు తోడేళ్లను బంధించారు. గ్రామాలపై తోడేళ్లు దాడి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

రెండు నెలలుగా పెరిగిన దాడులు..
ఖారీపైర్‌లోని ఛత్తర్‌పూర్‌లో సోమ, మంగళవారం మధ్య రాత్రి ముగ్గురు పిల్లలపై దాడి చేశాయి తోడేళ్లు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే తోడేళ్లు దగ్గరలోని రాయ్‌పూర్‌ గ్రామానికి వెళ్లాయి. అక్కడ ఐదేళ్ల చిన్నారిని ఇంటి నుంచి పట్టుకెళ్లాయి. ఈ ప్రాంతంలో గత రెండు నెలలుగా తోడేళ్ల దాడులు ఎక్కువ అయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది చిన్నారులు, ఒక మహిళ సహా తొమ్మిది మంది చనిపోయారు.

ఏనుగు పేడకు నిప్పంటించి..
ఏనుగు పేడ, మూత్రంతో తోడేళ్లను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఏనుగు పేడకు నిప్పటించడం, దగ్గరలో ఏనుగు లాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించి తోడేళ్లు జనాలకు దూరంగా వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వేటాడే గుణం ఉన్న తోడేళ్లు, ఏనుగు లాంటి పెద్ద జంతువుల జోలికి వెళ్లవని చెప్తున్నారు. తోడేళ్ల దాడిని తప్పించుకునేందుకు గ్రామస్తులు రాత్రింబవళ్లు కాపలాగా ఉంటున్నారు.

కరెంటు లేని కారణంగా..
తోడేళ్లు సంచరిస్తున్న ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు కరెంట్‌ సరఫరా లేదు. లైట్లు లేక, చీకటి కారణంగా తోడేళ్లు దాడులు చేస్తున్నట్లు జనం చెప్తున్నారు. ఈ ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉందని, చాలామందికి పక్కా ఇళ్లు లేకపోవడంతో ఆరుబయటే పడుకుంటారని, అలాంటివారికి తోడేళ్ల నుంచి మరింత ప్రమాదం ఎదురవుతోందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. తోడేళ్ల దాడిలో చనిపోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు, అటవీ శాఖ నుంచి రూ. లక్ష కలిపి మొత్తం రూ. 5 లక్షల పరిహారం ఇస్తున్నారు.