Homeజాతీయ వార్తలుBhadrachalam Railway Line: ఒడిస్సా నుంచి భద్రాద్రి వరకు కొత్త రైల్వే లైన్.. ప్లాన్ ఏంటి?...

Bhadrachalam Railway Line: ఒడిస్సా నుంచి భద్రాద్రి వరకు కొత్త రైల్వే లైన్.. ప్లాన్ ఏంటి? ఏం జరుగుతుంది..?

Bhadrachalam Railway Line
Bhadrachalam Railway Line

Bhadrachalam Railway Line: ఒడిశా లోని మల్కనగిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు రైల్వే లైన్ వేయడానికి సర్వేన వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలను కలుపుతూ మన్యం ప్రాంతంలో రైల్వే లైన్ వస్తే అది అనేక మార్పులకు దారి తీస్తుందని భావిస్తున్నారు. ఒడిస్సా లోని మల్కన్ గిరి అటవీ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు జిల్లాలో ఉన్న చింతూరు మీదుగా భద్రాచలం వరకు కొత్త రైల్వే లైనుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో ఈ లైన్ నిర్మాణం జరగనుంది. ఈ రైల్వే లైన్ పొడవు 173.416 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.2, 800 కోట్లు. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండే ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం 213 వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. అందులో 48 భారీ వంతెనలు కూడా ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈ మార్గం దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. దానికి తగ్గట్టుగా మూడు కోట్లు విడుదల చేశారు. ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించారు. ఈ సర్వే జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. సర్వే నివేదిక సిద్ధమైన తర్వాత దానిని పరిశీలించి రైల్వే బోర్డు తుది అనుమతి ఇవ్వగానే నిర్మాణ పనులు మొదలవుతాయి.

మూడు రాష్ట్రాలకు ప్రయోజనం..

తాజాగా నిర్మించాలనుకుంటున్నా రైల్వే లైనుతో పలు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది. ఒడిశా లోని జైపూర్ నుంచి ప్రస్తుతం రైల్వే పనులు జరుగుతున్నాయి. దానిని మరింత విస్తరించి ఏపీ తెలంగాణను కలిపి ఎందుకు ఈ మార్గానికి అనుమతించారు. కొత్త లైను ఒడిస్సా లోని మల్కన్ గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్గూడ, మహారాజ్ పల్లి, లూనిమన్ గూడల మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంది. కూనవరం, ఎటపాక మండలాల్లోని గ్రామాల మీదుగా కన్నాపురం, కుట్టు గుట్ట, పళ్ళు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. అటవీ ప్రాంతంలో రవాణా సదుపాయాలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రయాణికుల కోసమే ఈ మార్గం అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సరుకు రవాణా కి కూడా ఈ లైన్ అణువుగా మలుచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సింగరేణి కార్పొరేషన్ తో కలిసి భద్రాచలం – సత్తుపల్లి మధ్య రైల్వే లైన్ వేస్తున్నారు. భద్రాచలం – పాండురంగాపురం లైన్ కు దీనిని అనుసంధానించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ప్రయాణికులు విలువైన ఖనిజాల రవాణాకు కొత్త మార్గం మేలు చేస్తుందని ఇండియన్ రైల్వేస్ లో సీనియర్ ఇంజనీర్ గా పని చేసిన ఎల్ ప్రసాద్ అనే అధికారి పేర్కొన్నారు.

మల్కన్ గిరి – భద్రాచలం కొత్త లైన్ ద్వారా పలు మార్పులు జరుగుతాయి. గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపరచడం అంటే వారి జీవన విధానం మార్పునకు దోహదపడుతుంది. రైల్వేలు ఇటీవల సరుకు రవాణా ద్వారా భారీగా ప్రయోజనం పొందుతున్న తరంలో కొత్త మార్గం అనేక రకాల సరుకుల రవాణాకు ఉపయోగపడనుంది. అటు విశాఖకు గాని ఇటు తెలంగాణ వైపు గాని తరలించేందుకు ఈ మార్గం ప్రయోజనకరంగా. రైల్వే శాఖ మంత్రి ఒడిశా నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున అక్కడి మారుమూల ప్రాంతాల్లో రైల్వే లైనులకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని చెబుతున్నారు.

పెండింగ్ ప్రాజెక్టుల సంగతి..?

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ మార్చి పదో తేదీన మల్కన్ గిరి ప్రాంతంలో పర్యటించారు. మల్కన్ గిరి – భద్రాచలం లైన్ పురోగతిని సమీక్షించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తమ ప్రతిపాదనలను కేంద్రమంత్రి ముందు ఉంచారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనల దశలోనే ఉంది. కొన్ని నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని డబ్లింగ్ పనులు సాగుతున్నాయి. ఒకవైపు రైల్వే జోన్ అందుబాటులోకి రాకపోగా రైల్వే ప్రాజెక్టులు కూడా ఆశించినంత వేగంతో సాగకపోవడం పట్ల ఏపీ ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రతిపాదనగా ఉన్న భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2021- 22 బడ్జెట్లో ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5,812 కోట్లు కేటాయించినట్లు పార్లమెంటుకు రైల్వే శాఖ తెలిపింది. కానీ అందులో రూ.2,155 కోట్ల నిర్మాణ అంచనా వేసిన కొవ్వూరు – భద్రాచలం మార్గం పనులకు మాత్రం మోక్షం లభించలేదు. దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున వాటాతో నిర్మించాల్సి ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉందని కేంద్రం రాతపూర్వకంగా తెలిపింది. 1965 నుంచి ఏ రైల్వేలైన్ నిర్మించాలన్న డిమాండ్ ఉంది. కొవ్వూరు, పంగిడి, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వరావుపేట, రాయవరం మీదుగా 1505.6 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించి మార్గమధ్యంలో 16 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ లైన్ నిర్మాణం జరిగితే కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును నేరుగా రైల్వే ద్వారా విశాఖకు, హైదరాబాద్కు పంపడానికి వీలుంటుంది.

కోనసీమ రైల్వే లైన్ కూడా అంతే..

ప్రస్తుతం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాలో ఉన్న కోనసీమ ప్రాంతానికి రైల్వే సదుపాయం కూడా సుదీర్ఘకాల డిమాండ్. దానికి కేంద్రం కూడా అనుమతించింది. పనులు కూడా మొదలయ్యి రెండు దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి లోక్సభ స్పీకర్ గా పనిచేసిన జిఎంసి బాలయోగి హయాంలో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురం వచ్చి 1999లో రైల్వే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 57 కిలోమీటర్లు పొడవునా ఈ రైల్వే లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా కొబ్బరి ఎగుమతులకు మార్గం సుగమం అవుతుంది. పాతికేళ్లు గడుస్తున్నా నేటికీ కోనసీమలో రైల్వే కూత వినిపించలేదు. రూ.2,120 కోట్లతో నిర్మించాల్సిన ఈ లైన్ ద్వారా కాకినాడ – నర్సాపురం అనుసంధానం అవుతాయి. కానీ ఇప్పటివరకు కోటిపల్లి వరకు మాత్రమే రైల్వే లైన్ పూర్తయింది. అక్కడ గోదావరి మీద వంతెన నిర్మాణ పనులు చాలా కాలంగా సాగుతున్నాయి. అందులో ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం 25% నిధులు వెచ్చించాల్సి ఉంది. అందులో ఇంకా రూ.358 కోట్లు పెండింగ్లో పెట్టిందని రైల్వే శాఖ తెలిపింది. 2021లో కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే విడుదల చేసిందని రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేస్తే రైల్వే పనులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళితే ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తవుతుందని కోనసీమ రైల్వే సాధన సమితి ప్రతినిధి వీరేశ్ తెలిపారు.

Bhadrachalam Railway Line
Bhadrachalam Railway Line

వివిధ దశల్లో పలు ప్రాజెక్టులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 33 రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఇందులో 16 కొత్త లైన్లు కాగా, 17 డబ్లింగ్ పనులుగా పేర్కొంది. సుమారుగా 576 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.63,731 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందులో నడికుడి లైన్ సిద్ధం అవుతోంది. గుడివాడ – భీమవరం మీదుగా విజయవాడ – నరసాపురం మార్గం డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ కూడా దాదాపు పూర్తయింది. నడికుడి – శ్రీకాళహస్తి లైన్, కడప- బెంగళూరులోని వంటివి నిర్మాణ దశలో ఉన్నాయి. అమరావతి రాజధాని ప్రాంతానికి రైల్వే లైన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాకినాడ ను మెయిన్ లైన్ లో కలపాలన ప్రతిపాదన కూడా ముందుకు సాగలేదు. నడికుడి శ్రీకాళహస్తి మార్గంలో సర్వీసులు మొదలయ్యాయి. త్వరలోనే గుంటూరు మీదుగా తిరుపతికి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా చెల్లించి పనులు పూర్తి చేసేందుకు సహకారం అందిస్తున్నామంటూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యతనివ్వాలనే విషయంలో తాము పోరాడుతున్నామని ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular