MLA Mekapati Chandrasekhar Reddy: అధికార పార్టీలో ముసలం పుట్టింది. అధిష్ఠానం పై అసమ్మతి రగులుతోంది. తాడోపేడే తేల్చుకునేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్ఠానం పై అసమ్మతి ప్రకటించారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే వారి జాబితాలో చేరారు. పార్టీ అధిష్ఠానం పై కన్నెర్ర చేశారు. తాడేపేడే తేల్చుకుంటానని ప్రకటించారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు ? వైసీపీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీ పై ధిక్కార స్వరం వినిపించారు. వైసీపీని వదిలేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆ పార్టీలో చేరేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే వారికి జతకట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధిష్ఠానం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడు చిచ్చుపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నాడని సీఎంకు ఫిర్యాదు చేసినట్టు మేకపాటి తెలిపారు.
ఉదయగిరి పరిశీలకుడు ధనుంజయరెడ్డి తీరుతో వైసీపీకి చెడ్డపేరు వస్తుందని ఆరోపించారు. తన మీద పెత్తనం చేయాలని చూస్తే కుదరదని అన్నారు. సీఎం, మంత్రి దగ్గర తేల్చుకోవడానికే కాదు, దేనికైనా సిద్ధమంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం కీలకమైనది. కొన్ని దశాబ్దాలుగా మేకపాటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంది. కానీ ఇప్పుడు అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మేకపాటి కూడా ఆనం, కోటంరెడ్డి దారిలో పయనిస్తారా ? అన్న చర్చ జోరందుకుంది.

ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసమయంలో అధిష్ఠానం తీరు పై విమర్శలు చేయడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలో ఆనం, మేకపాటి కుటుంబాలు కీలకమైన కుటుంబాలు. అలాంటి కుటుంబాలకు చెందిన ఎమ్మెల్యేలు వైసీపీలో ఇమడలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వదిలితే వైసీపీకి గట్టిదెబ్బపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అధిష్ఠానం పై వ్యతిరేక స్వరం వినిపించారు. భవిష్యత్తులో ఇంకెంతమంది వారి జాబితాలో చేరుతారో వేచిచూడాలి.