Rangareddy: క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు.. అనర్థాలకు దారితీస్తున్నాయి. అందుకే ఏ నిర్ణయమైనా తీసుకునేముందు పది అంకెలు లెక్కపెట్టమటారు పెద్దరు. కానీ నేటి తరం.. వెనకా ముందు ఆలోచించడం లేదు. ఆవేశపూర్తి నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా భార్యతో తలెత్తిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. భర్త పురుగు మందు తాగాడని… భార్య ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతి చెందిందని తల్లి తనువు చాలించింది. గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో విషాద ఘటనలు జరిగాయి.
చిన్నపాటి గొడవతో..
సంసారం అన్నాక కలహాలు, కలతలు సాధారణం. భార్యాభర్తలిద్దరనూ సర్దుకుపోతేనే సంసార నావ సాఫీగా సాగుతుంది. అయితే రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో భార్యతో గొడవ పడిన భర్త క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. తన వల్లే భర్త అలా చేశారనే పశ్చాత్తాపంతో భార్య ఉరివేసుకుంది. తన కుమార్తె కాపురం ఇలా అయ్యిందేమిటనే ఆవేదనతో.. ఆమె తల్లి సంపులో దూకి తనువు చాలించింది. హైతాబాద్ గ్రామానికి చెందిన మల్లేశ్, యాదమ్మ కు ఒక కుమార్తె, కుమారుడు. మల్లేశ్ కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె సుమిత్ర అలియాస్ శిరీషకు రెండున్నర సంవత్సరాల క్రితం రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్‌తో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. వారి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో శివకుమార్ ఆదివారం పురుగుల మందు తాగారు. చికిత్స కోసం ఆయనను వికారాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నాడు.
పశ్చాత్తాపంతో ఉరేసుకున్న భార్య..
అయితే తన కారణంగానే భర్త ఆత్మహత్యకు యత్నించాడని సుమిత్ర పశ్చాతాపం చెందింది. సమాజం తనను నిందిస్తుందని ఆవేదన చెందింది. మనస్తాపం చెందింది. క్షణికావేశంలో మంగళవారం రాత్రి హైతాబాద్‌లోని తల్లిగారి ఇంట్లో ఉరేసుకుంది.
ఆమె అదే చేసింది..
అల్లుడు శివకుమార్, కూతురు సుమిత్ర క్షణికావేశంలో చేసిన తప్పునే.. కూతురు తల్లి యాదమ్మ కూడా చేసింది. కూతురు కాపురం ఇలా అయిందేంటని మనస్తాపంతో ఇంటి ముందు ఉన్న సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
క్షణికావేశంలో శివకుమార్ తీసుకున్న నిర్ణయం.. తర్వాత ఇద్దరి ప్రాణాలు తీసుకునేందుకు కారణమైంది. కొన్ని గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది.