Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan- MLC Election: ఎగిరెగిరి పడితే..ఇలానే ఉంటుంది జగన్?

CM Jagan- MLC Election: ఎగిరెగిరి పడితే..ఇలానే ఉంటుంది జగన్?

CM Jagan- MLC Election
CM Jagan- MLC Election

CM Jagan- MLC Election: ఎగిరెగిరి పడితే ఫలితం ఇలానే ఉంటుంది. ఏపీలో వైసీపీని పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. అధికారం ఉంది కదా అని తమను తాము అందరికంటే అతిగా భావించుకోవడం, చెప్పిందే వేదమని ప్రజలను మభ్యపెట్టేందుకు తాపత్రయపడటం, లేనిది ఉన్నట్లుగా, జరగనిది కాబోతున్నట్లు నమ్మించడం ఇది ఇప్పటివరకు చేసింది, చేస్తున్నది. టీడీపీని కాదని అధికారం కట్టబెట్టింది ఇందుకేనా అని అన్ని వర్గాలు ఈసడించుకునే స్థితికి జారిపోయారు. అయినా ఆత్మవలోకం లేదు. మేకపోతు గాంభీర్యమే. ప్రతిపక్షాలతో పాటు ప్రజలను కూడా వేధించడం బహుశా జగన్ మనస్తత్వానికి తెలియజేస్తుందేమో.

చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?

అధికారంలోకి రాక ముందు జగన్ పాదయాత్ర చేశారు. అందిరికీ అన్ని ఇస్తామన్నారు. ఎక్కడా మాట జారకుండా మడపతిప్పకుండా పనిచేస్తామని హామీలిచ్చారు. ఆయన మాటలు నమ్మిన ఓటర్లు చంద్రబాబును కాదని జగన్‌కు అధికారం కట్టబెట్టారు. అంతవరకు బాగానే ఉన్నా, అప్పటి వరకు ఉన్న పరిస్థితులకు, ఆ తరువాత జరిగిన దానికి పొంతన లేకుండా పోయింది. స్వంత అజెండాను అమలు చేయడం ప్రారంభించారు. అధికార దర్పంతో మిడిసిపడటం ప్రారంభించారు. టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలతో వ్యవస్థలను నాశనం చేయడం ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనులను నిలిపివేశారు. ఆ పార్టీ అనుకూలంగా ఉన్నవారు మాత్రమే అపార్ట్‌మెంట్లు, ఇతర కట్టడాలను చేపడుతున్నారని వారందరినీ దెబ్బకొట్టాలన్న ఉద్దేశ్యంతో ఇసుకను కొన్నాళ్ల వరకు ఆపేశారు. ఆర్థికంగా చతికిలపడేలా చేసి పైశాచిక ఆనందం పొందారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతింది. భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేకుండా పోయాయి. సిమెంటు, ఇటుక, కరెంటు పనివారు, కార్పెంటర్లు కొన్ని నెలలుగా ఖాళీగా ఉండిపోయారు. ఇక, ఉద్యోగుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. అలెన్సులు నిలిపివేశారు. భవిష్య నిధి డబ్బులను దారిమళ్లించేశారు. ఏదైనా అత్యవసరమైతే వాళ్ల డబ్బులు వాళ్లు తీసుకోలేని దయనీయ స్థితిలోకి వెళ్లిపోయారు. సీపీఎస్ రద్దు అంశం అటకెక్కింది. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నారు.

ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లు

ఉంటున్న ఇంటికి డబ్బులను ఓటీఎస్ పేరుతో చెల్లించాల్సిన దుర్భర పరిస్థితి తీసుకువచ్చిందీ వైసీపీ ప్రభుత్వం. వలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు, పోలీసులను ఇళ్ల మీదకు పంపి బలవంతంగా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారు. వీరంతా సామాన్య కుటుంబీకులే. పక్కాగా డాక్యుమెంట్లు ఉన్నా అతి కష్టమ్మీద చెల్లించారు. కొందరైతే ప్రభుత్వమ్మీద దుమ్మెత్తిపోశారు కూడా. రాజ్యాంగం కల్పించిన చట్టాలను కూడా లెక్కచేయక, స్వంత జీవోలను తీసుకువచ్చి అవే చట్టాలను వారి మీద బలవంతం రుద్దిందీ వైసీపీ ప్రభుత్వం. రాజధాని అమరావతి అంశాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు. సేకరించిన భూమిని స్మశానంలా మార్చివేశారు. అక్కడ జగన్ తన మాట నెగ్గాలన్న పంతం తప్పితే, ప్రజలపై ప్రేమ లేదని చెప్పకనే చెప్పేశారు. మరీ, సిగ్గులేకుండా అమరావతి అనే బ్రాండ్ పేరును ఉపయోగించి అక్కడి భూములను అమ్మేందుకు సిద్దపడ్డారు.

అస్తవ్యస్తంగా సామన్యుడి జీవితం

వైసీపీ పాలనతో సామాన్యుడి జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. రోజంతా కష్టపడి సంపాదించుకున్న దాంట్లో దాదాపు 80 శాతం ఆ రోజే ఖర్చు పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. ఇంకా మెరుగైన పాలన చూస్తామనుకున్న అన్ని వర్గాల ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. మద్యపాన నిషేధం పేరుతో వైన్సులను తీసుకువచ్చారు. బార్ల పాలసీలను మార్చారు. మద్యపానం మీద గత టీడీపీ ప్రభుత్వంలో సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయం ఉంటే, వైసీపీ పాలనతో అది పెరిగి రూ.20 వేల కోట్ల వరకు చేరింది. ఎన్నడూ వినని బ్రాండ్లను మద్యంప్రియులకు అంటగడుతున్నారు. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పడిపోతుంది. ద్రవ్యోల్బణం రాజ్యమేలుతుంది. అన్ని సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గ ఆదాయం మాత్రం పెరగకపోతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

CM Jagan- MLC Election
CM Jagan- MLC Election

సంక్షేమ పథకాల డబ్బుల కోసం ఎదురుచూపు

కొనుగోలు శక్తి పడిపోతుండటంతో వైసీపీ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల నిధుల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అమ్మఒడి, ఆసరా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలకు ఏటా నిధులు విడుదల చేస్తుంది. ఆ డబ్బులు పడిన వెంటనే ఖర్చుల సర్దుబాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ డబ్బుల విడుదలకు బటన్ నొక్కడం కూడా కొంత ఆలస్యమవుతుండటంతో అవి ఎప్పుడు వస్తాయా అని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

అన్ని వర్గాల నాశనంతో సాధించిందేంటి?

రాష్ట్ర ఆర్థిక మూలాలన్ని నరికేసి ప్రజలు భికార్లుగా వైసీపీ ప్రభుత్వం మార్చివేస్తుంది. అందుకే అన్ని వర్గాల నుంచి తిరుగుబావుటా ఎదురవుతుంది. బలవంతుడిని అనుకునే వాడికి ఆ బలం ఇచ్చిన వారిని ఆ చెంప ఈ చెంప వాయిస్తే ఫలితం భవిష్యత్తులో కనబడుతుంది. అధికార అహంకారంతో విర్రవీగితే నేల చూపులు చూడటానికి ఎంతో సమయం పట్టదు. కేంద్రం నుంచి కుప్పలు కుప్పలుగా అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్న ఈ ప్రభుత్వం అరాచకత్వాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బడ్జెట్ అంతా బూటకమని నమ్మే స్థితికి తెచ్చకుంది కూడా వాళ్లే. ప్రశ్నించే వారిని హింస పెట్టాలన్న కుంచిత మనస్తత్వం పాలకుల లక్షణం కాదు. తాను జైలు కెళ్లాను కాబట్టి, అందరూ జైలుకెళ్లాలి, సీబీఐ ఎంక్వైరీలు నడవాలన్న అధికార దుర్వినియోగానికి పాల్పడటం వంటి పనులు వారి అహాన్ని చల్లార్చవచ్చు. ఇటీవల వైసీపీ గెలిచిన ఎమ్మెల్సీ సీట్లు అంత మెజార్టీని ఏం సాధించిపెట్టలేదు. గ్రాడ్యుయేట్లు కర్రు కాల్చి వాత పెట్టారు. చివరకు స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతున్న పరిస్థితి నిన్నటి ఎమ్మెల్యే పోలింగ్ ను చూసి అర్థమవుతుంది. ఇది అసలు లెక్కలోనిదే కాదని పార్టీ ప్రధాన సలహాదారుడు సజ్జల చెప్పడంలో తప్పులేదు. బహుశా పరిస్థితి అర్థమైతే ఎమ్మెల్యేలు కూడా ప్లేటు ఫిరాయిస్తారన్న భయమై ఉండవచ్చు. ఒకవేళ ప్రభుత్వం మారితే తమపై వేధింపులు ఉంటాయని భావించిన వారందరూ ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలతో టచ్ లు ఉన్నారు. ఇక, రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.
RELATED ARTICLES

Most Popular