Mithra Mandali Teaser Review: ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు తక్కువ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ చల్లబడిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో చిన్న సినిమాలు వరుసగా విడుదల అవుతూ సూపర్ హిట్స్ ని అందుకుంటూ బాక్స్ ఆఫీస్ కి కొత్త ఊపిరి అందిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘కోర్ట్’,’సింగిల్’ వంటి చిత్రాలు అందుకు ఒక ఉదాహరణ. ఇప్పుడు అలాంటి ప్రామిసింగ్ సూపర్ హిట్ మరొకటి టాలీవుడ్ కి రాబోతుందని ఈరోజు విడుదలైన ‘మిత్ర మండలి'(Mitra Mandali Movie) టీజర్ ని చూసిన తర్వాత తెలుస్తుంది. ప్రియదర్శి(Priyadarshi), రాగ్ మయూర్(Rag Mayur), విష్ణు(VIshnu Oi), నిహారిక NM(Niharika NM) , వెన్నెల కిషోర్(Vennela Kishore), సత్య(Sathya) ఇలా ఎంతో మంది నటీనటులు ఈ చిత్రం లో భాగం అయ్యారు. ఈ చిత్రం ద్వారా విజయేందర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. ఈ టీజర్ ఎలా ఉందో ఒకసారి విశ్లేషిద్దాం.
ఇలా స్నేహితుల జానర్ లో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వస్తే మన అందరికీ సహజంగానే ‘జాతి రత్నాలు’ చిత్రం గుర్తు వస్తూ ఉంటుంది. ఈ టీజర్ ని చూసినప్పుడు కూడా మన అందరికీ జాతి రత్నాలు చిత్రం గుర్తుకు వచ్చే ఉంటుంది. ఈ టీజర్ లో క్రికెట్ పిచ్చి ఉన్న ఒక నలుగురు యువకుల కథని చూపించినట్టు గా తెలుస్తుంది. ప్రతీ రోజు వీళ్లకు క్రికెట్ ఆడడం అలవాటు. ఒకవేళ బాల్, బ్యాట్ లేకపోయినా కూడా ఉన్నట్టు ఊహించుకొని ఆడుతుంటారు. జనాలు వీళ్ళను చూసి పిచ్చోళ్ళు అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి తింగరోళ్ళు కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఒక సమస్యలో చిక్కుకుంటారు. ఆ సమస్య ఏమిటి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రంలో ఇన్ స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లో అత్యంత పాపులారిటీ ని సంపాదించిన నిహారిక NM కీలక పాత్ర పోషించడం విశేషం.
ఈమె తెలుగు అమ్మాయే, కానీ పాన్ వరల్డ్ రేంజ్ లో తన వీడియోస్ తో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గానే ఈమె హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ తో ఫోటోలు దిగడం సంచలనంగా మారింది. తమిళం లో ఇప్పటికే ఒక సినిమా చేసింది, తెలుగు లో ఇదే ఆమెకు మొదటి సినిమా. టీజర్ లో ఆమెకు సంబంధించిన షాట్స్ ని చూస్తుంటే , ఇందులో ఆమె నెగటివ్ క్యారక్టర్ చేసినట్టు గా అనిపించింది. ఇక ఈ టీజర్ లో సత్య, వెన్నెల కిషోర్ కామెడీ బాగా ఆకట్టుకుంది. ఇక టీజర్ చివర్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉండగా ఈ నలుగురు స్నేహితులు కూర్చున్న కారు అద్దానికి బాల్ తగులుతుంది. అప్పుడు ప్రియదర్శి బాల్ చేతిలో పెట్టుకొని పైసలు ఇచ్చి బాల్ తీసుకొని వెళ్ళరా అని అంటాడు. అప్పుడు ఆ పిల్లాడు పదరా కొత్త బాల్ కొనుక్కుందాం అంటూ పలికిన డైలాగ్ నవ్వులు పూయించింది.