All Set for Perni Nani arrest : మాజీ మంత్రి పేర్ని నాని( perni Nani ) చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్టు తప్పదా? ఆయనతో పాటు కుమారుడు కిట్టు అరెస్టు అవుతారా? అందుకే పేర్ని నాని పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్ని నానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి విషయంలో నాని భార్యపై కేసు నమోదు అయింది. వారికి చెందిన గోదాముల నుంచి పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యం పెద్ద ఎత్తున మాయం అయ్యింది. అప్పట్లో భార్య పేరిట కేసు నమోదు కావడంతో ఓ 15 రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పేర్ని నాని కుటుంబ సభ్యులు. అప్పట్లో కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం.. న్యాయస్థానం మంజూరు చేయడం తరువాత బయటకు కనిపించారు.
ఆ దూకుడు తనంతో..
అయితే ఇటీవల పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై( Alliance government ) రెచ్చిపోతున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా అవతారం ఎత్తారు. పార్టీ శ్రేణులు, కేసుల బాధితుల విషయంలో జగన్మోహన్ రెడ్డి నానికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన సైతం పాత విధానంలో మాదిరిగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కూటమి నేతలకు సవాల్ విసురుతున్నారు. దీనిని ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు టిడిపి, జనసేన శ్రేణులు. పేర్ని నాని విషయంలో అంత ఉదాసీనత ఎందుకని కూటమి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పేర్ని నాని చుట్టూ నకిలీ ఇళ్ల పట్టాల కేసు బిగుసుకుంటున్నట్లు సమాచారం.
వేలాదిగా నకిలీ పట్టాల పంపిణీ..
2024 సార్వత్రిక ఎన్నికలకు( general elections ) ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారన్నది ప్రధాన ఆరోపణ. 2024 ఎన్నికల్లో తాను తప్పుకున్నారు. తన కుమారుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ రాజకీయ ప్రత్యర్థిగా సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడిని గెలిపించుకునేందుకు నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలు వేలాదిగా అందించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ కేసును తెరపైకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. రాజకీయ లబ్ధి కోసం వేలాది మందిని మోసం చేశారని అభియోగాలు మోపుతోంది. అందుకే మాజీమంత్రి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు సైతం అరెస్టు అవుతారని ప్రచారం నడుస్తోంది.
పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం..
మరోవైపు సొంత నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం( emergency meeting) నిర్వహించారు మాజీమంత్రి పేర్ని నాని. తన విషయంలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. తన భార్యను జైల్లో పెడతారని భావించి 15 రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితి ఇంకో నాయకుడికి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఒకానొక దశలో రాజకీయాలనుంచి తప్పుకుంటే మేలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా చెప్పారు. అయితే ఇంతకు పదింతలు అనుభవించే రోజులు మున్ముందు ఉన్నాయని హెచ్చరించారు. మొత్తానికి అయితే అరెస్టుల జాబితాలో మరో మాజీ మంత్రి చేరడం విశేషం.