Miss World Competitions: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గడిచిన పదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇక్కడి సదుపాయాలు కూడా అంతర్జాతీయ గుర్తింపు రావడానికి మరో కారణం. ఇక మన హైదరాబాద్(Hyderabad )మరో అంతర్జాతీయ పోటీలకు వేదిక కాబోతోంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మిస్ వరల్డ్(Miss World) పోటీలు ఈసారి హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈమేరకు నిర్వాహకులు నిర్ణయించారు. దీంతో 72వ ప్రపంచ సుందరి పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. తెలంగాణ చారిత్రక, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పడానికి తెలంగాణకు ఇదో గొప్ప అవకాశం కానుంది. నాలుగు వారాలపాటు జరిగే ఈ పోటీల ప్రారంభం, ముగింపు వేడుకలతోపాటు గ్రాండ్ ఫినాలేను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాలకు చెందిన అందెగత్తెలు రానున్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే లక్ష్యంతో నిర్వహించే.ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే దేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలకబోతోంది.
ఎప్పటి నుంచంటే..
ప్రపంచ అందాల పోటీలు మే 7వ తేదీ నుంచి జరుగనున్నాయి మే 31న గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ప్రస్తుతం మిస్ వరల్డ్ తర్వాత అందాల సుందరి కిరీటాన్ని ఎవరు సాధిస్తారో గ్రాండ్ ఫినాలే రోజు తెలుస్తుంది. గతంలో మిస్ వరల్డ పోటీలను ఢిల్లీ, ముంబైలో నిర్వహించారు. 71వ ప్రపంచ సుందరి పోటీలు ముంబైలో జరిగాయి. 72వ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్బబోతోంది.
మౌలిక సదుపాయాలు..
ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది. ఐటీ, ఫార్మాస్యూటికల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకుపోతోంది. మరోవైపు తెలంగాణను పర్యాటకంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. తెలంగాణ జరూర్ అనే నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానిస్తోంది. గొప్ప చేనేత వారసత్వం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు.. అరుదైన వంటకాలు, విభిన్న కళా వారసత్వమున్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని, మరో అంతర్జాతీయ ఉత్సవానికి హైదరాబాద్ వేదిక అవతుఉందని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు.