
Adulterated Milk: మీరు చదివింది నిజమే. ఇదేదో మేం చెబుతున్నది కాదు. సాక్షాత్తూ అధికారుల తనిఖీల్లో వెల్లడయిన చేదు వాస్తవం. మీరు పొద్దున్నే తాగే పొగలు కక్కే వేడి పాలు.. భోజనం చివర్లో అన్నంలో కలుపుకొనే గడ్డ పెరుగు స్వచ్ఛమైనది కాదు. అది ముమ్మాటికీ విషం. ‘పాల’కూట విషం. ఆ విష పాలు దీర్ఘకాలంలో కీలక అవయవాలైన మూత్రపిండాలు, కాలేయాన్ని దెబ్బతీసి మనిషిని మంచంపట్టేలా చేస్తాయి. ఆరోగ్యం కోసం అని మనం తాగుతున్న పాలు, పెరుగును కొందరు దారుణంగా కల్తీ అవుతున్నాయి. రాష్ట్ర ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. కొన్ని కంపెనీలు పాలల్లో.. శవాలను నిల్వచేసేందుకు ఉపయోగించే ఫార్మలిన్ అనే రసాయనాన్ని, పెరుగులో.. పెయింట్ ఆరిపోయాక వదలకుండా ఉండేందుకు కలిపే ప్రొటీన్ బైండర్ అనే రసాయనాన్ని కలుపుతున్నాయి. దాదాపు 15 పాల కంపెనీలు, ఎనిమిది పెరుగు కంపెనీలను గుర్తించి సీజ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రైతుల దగ్గరి నుంచి పాలు స్వచ్ఛంగానే వస్తున్నా, వాటిని సేకరించే సంస్థలే కల్తీ చేస్తున్నాయి. స్వచ్ఛమైన పాలల్లో ఏం కలిపినా కల్తీ కిందికేవస్తుంది. ఇంత దర్జాగా పాలు, పెరుగును కల్తీ చేస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫార్మలిన్ రసాయనం మిక్స్ చేయడం వల్ల పాలు చిక్కగా కనిపిస్తాయి. ఎక్కువ సమయం నిల్వ ఉంటాయి. ప్రతి 25 లీటర్ల పాలల్లో నిర్దేశించిన ప్రమాణాల్లో ఫార్మలిన్‌ను కలుపుతున్నారు. వాస్తవానికి ఫార్మలిన్ అనేది యాంటీ సెప్టిక్‌గా వినియోగిస్తారు. డిస్‌ఇన్ఫెక్ట్‌నూ వాడతారు. త్వరగా పాడైపోయే వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు దీన్ని వినియోగిస్తారు. పాల ను ఎక్కువ దూరం పంపాల్సిన సమయంలో ఈ రసాయనాన్ని అధిక మోతాదులో కలుపుతున్నారు.

ఫార్మలిన్ కలపడం వల్ల పాలను చల్లని ప్రదేశంలో ఉంచకపోయినా పాడవ్వవు. ఫార్మలిన్ కలిపిన పాలను తాగడం వల్ల దీర్ఘకాలంలో కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులూ వస్తాయి. ఇక ప్రొటీన్ బైండర్ కలపడం వల్ల పెరుగు గడ్డలా మారి.. చూడగానే తినబుద్దేసేలా ఉంటుందని చెబుతున్నారు. ఇక రంగారెడ్డి, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో పూర్తి అపరిశుభ్రమైన వాతావరణం మధ్య జీహెచ్‌ఎంసీ ఇచ్చిన తడిపొడి చెత్త డబ్బాలను పాలను తోడు పెట్టేందుకు ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం ఎండకాలంలో పాల ఉత్పత్తి తగ్గుతుంది. డిమాండ్ ఉన్న మేరకు పాల సరఫరా సాధ్యం కాదు. రాష్ట్రంలో రోజుకు 45 లక్షల లీటర్ల పాలు విక్రయాలు జరుగుతాయి. వీటిలో హైదరాబాద్ వాటనే 25 లక్షల లీటర్లు. అయితే రాష్ట్రంలో ఉత్పత్తవుతోంది 35 లక్షల లీటర్లు మాత్రమే. మిగతా 8-10 లక్షల లీటర్ల పాలను కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వేసవి కావడంతో అక్కడి నుంచి వచ్చే పాల సరఫరా కూడా తగుతోంది. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు పాలను దర్జాగా కల్తీ చేసేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటాడుకుంటున్నారు.