
TSPSC Paper Leak ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. ఈనానుడి ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీ విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమవుతోంది. వెబ్ సైట్ హ్యాక్ తర్వాత పోలీసులు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్న సమయంలో పలు విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఇంటి దొంగల పాత్ర ఉందనే విషయం పోలీసులు విచారణలో తేలింది.
ఇంటిదొంగల సమస్య ఇబ్బందిగా మారింది
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ బాధ్యతలు తీసుకున్న టీఎ్‌సపీఎస్సీకి ఇంటిదొంగల సమస్య ఇబ్బందిగా మారింది. తాజాగా కంప్యూటర్ హ్యాకింగ్ సంఘటనతో కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ పరిస్థితి నెలకొంది. ఒక చిన్న తప్పు వల్ల లక్షల మంది అభ్యర్థులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో అపనమ్మకం ఏర్పడితే.. దానిని తొలగించడం అంత సులువైన విషయం కాదని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం 83 మంది రెగ్యులర్ సిబ్బంది
టీఎ్‌సపీఎస్సీ కార్యాలయంలో ప్రస్తుతం 83 మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఏ పనికైనా ఇందులోని వారినే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రూపు-1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేశారు. అలాగే పలు ఇతర విభాగాల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా టీఎ్‌సపీఎస్సీ ద్వారానే కొనసాగుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని చేపట్టడంతో ఏ చిన్న పొరపాటు జరిగినా.. లక్షలాది మందిపై ప్రభావం పడనుంది. దాంతో కమిషన్ అధికారులు మొదటి నుంచీ చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయినా.. ఇంటి దొంగలు పేపర్ లీకేజీకి పూనుకోవడం పట్ల అధికారులు కొంత ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

కంప్యూటర్ల వ్యవస్థను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దాలి
తాజా పరిణామాలతో వెబ్‌సైట్ నిర్వహణ, కంప్యూటర్ల వ్యవస్థను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దాలని టీఎ్‌సపీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సోమవారం సైబర్ సెక్యూటరీ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని సమాచారం బయటకు వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ల నిర్వహణలో మరింత రక్షణ చర్యల కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.