
Margadarsi: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును వైసీపీ సర్కారు వెంటాడుతోంది. ఆ గ్రూపునకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థల్లో ఏపీ సీఐడీ సోదాలు జరుపుతోంది. అవకతవకలను బయటపెడుతోంది. జిల్లాల వారీగా బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేస్తోంది. గత కొద్దిరోజులుగా జగన్ సర్కారు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో అక్రమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మార్గదర్శి కార్యాలయాల్లో విచారణ చేపడుతున్నారు. అర్ధరాత్రి వరకూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్ సంస్థల్లో ఆర్థిక నేరాలున్నాయంటూ అభియోగాలు మోపుతూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. చిట్ ఫండ్స్ చైర్మన్, ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు ఏ1, ఆయన కోడలు మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ ఏ2 లపై 420 చీటింగ్ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసిన సంగతి తెలిసిందే. మరో నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఈ నెల 24 వరకూ రిమాండ్ విధించింది.
అయితే తాము నిబంధనలకు లోబడే పనిచేస్తున్నామని మార్గదర్శి యాజమాన్యం చెబుతోంది. సెలవు రోజుల్లో సీఐడీ దర్యాప్తు ఏమిటని ప్రశ్నించింది. కానీ సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొత్తం ఏకకాలంలో సోదాలు నిర్వహించడమే కాకుండా నలుగురు మేనేజర్లను అదుపులోకి తీసుకుంది. శనివారం రోజంతా తనిఖీలు కొనసాగగా.. ఆదివారం కూడా కీలక దస్త్రాలను పరిశీలించారు. వేలాది మంది చిట్ సభ్యుల స్థానంలో తమ పేర్లను రాసుకున్న విషయాన్ని గుర్తించారు. నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాల్సి ఉండగా.. ఒక్క రూపాయి చెల్లించలేదు. డిపాజిట్లలో డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్ గా అన్నిచోట్ల చూపించారని.. వాటిని తమ వాటాగా చూపించే ప్రయత్నం చేశారని.. ఇది లింక్ సిస్టమ్ అని.. ఒకచోట తెగినా మొత్తం దివాలా తీసే చాన్స్ ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. అందుకే దానికి బాధ్యులు చేస్తూ ఏకకాలంలో నలుగురు మేనేజర్లను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

విజయవాడ లబ్బిపేట మార్గదర్శి కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం వరకూ సోదాలు జరిపారు. సాయంత్రం 4.30 గంటలకు అరెస్ట్ చేస్తామని మేనేజర్ శ్రీనివాసరావుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన్ను సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సునందమ్మ ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 24 వరకూ రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు.
విశాఖ సీతంపేట మార్గదర్శి కార్యాలయంలో శనివారం నుంచి సోదాలు జరుపుతున్నారు. మేనేజర్ తో పాటు సిబ్బందిని శనివారం రాత్రి అక్కడే ఉంచేసి దర్యాప్తు కొనసాగించారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ స్థానిక సీఐడీ అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. చివరకు 4.30 గంటల సమయంలో మేనేజర్ రామక్రిష్ణను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేజీహెచ్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.రాత్రి 10 గంటలకు విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తిరుమలరావు ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 24 వరకూ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
గుంటూరు అరండల్ పేట మార్గదర్శి కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం వరకూ సోదాలు కొనసాగాయి. బ్రాంచ్ మేనేజర్ శివరామక్రిష్ణను ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు సాయంత్రం 6 గంటల వరకూ విచారణ చేపట్టారు. అనంతరం అరెస్ట్ చేయనున్నట్టు లిఖితపూర్వకంగా తెలియజేశారు. తరువాత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి కొవిడ్ పరీక్షలు జరిపారు. రాత్రి పది గంటల సమయంలో జిల్లా జడ్జి పార్ధసారధి ఎదుట హాజరుపరిచారు. అయితే రిమాండ్ కు నిరాకరించిన ఆయన కండీషన్ బెయిల్ మంజూరు చేశారు.
రాజమండ్రి కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం వరకూ సోదాలు కొనసాగాయి. అరెస్ట్ చేస్తున్నామంటూ సాయంత్రం 4.30 గంటల సమయంలో మేనేజర్ శివశంకర్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగేశ్వరరావు ఎదుట హాజరుపరిచారు. కానీ కేసును కాకినాడ రెండో అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో మేనేజర్ శివశంకర్ ను రాత్రంతా కార్యాలయంలోనే ఉంచారు. అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో భారీగా అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో సీఐడీ మరింత పట్టు బిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.