Tomato Prices Increase: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఓ సామెత. ఆధునిక కాలంలో ఉల్లి తర్వాత ఆ స్థాయిలో మన వంటింటిని ఆక్రమించింది టమాటా. పప్పు నుంచి ములక్కాయ వరకు ఎందులో కలిపి వండినా త్వరగా కలిసిపోతుంది.. నాలుకకు సరికొత్త రుచిని అందిస్తుంది. అందుకే టమాటాను కూరగాయల్లో రారాజు అంటారు. అలాంటి రారాజు లాంటి టమాటా కొండెక్కి కూర్చుంది. సెంచరీని దాటి దూసుకెళ్లిపోతోంది. టమాటా పెరుగుదల చూసి ఏకంగా కేంద్ర ప్రభుత్వమే వణికి పోతోంది. “బ్బా బ్భా బూ కాస్త ఆ రేటు తగ్గించడం మా వల్ల కావడం లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే మాకు చెప్పండి” అంటూ ఏకంగా దేశ ప్రజలను కోరింది. దేవుని బట్టి అర్థం చేసుకోవచ్చు టమాటా రేంజ్ ఏమిటో.. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశం.. ఆఫ్ట్రాల్ ఒక కూరగాయ ముందు తలవంచడం నిజంగా ఆశ్చర్యకరమే.
పెరిగిన ఈ టమాటా ధర కేవలం దేశాన్ని.. కాకలు తిరిగిన అమెరికా కంపెనీ కి మెక్ డొనాల్డ్స్ కు కూడా చుక్కలు చూపిస్తోంది.. దేశవ్యాప్తంగా టమాటా రేట్లు ఆకాశాన్ని తాకడంతో మెక్ డొనాల్డ్స్ తమ రెస్టారెంట్ లోని మెనూ నుంచి టమాటాను తొలగించింది. దేశంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో ఈ మేరకు ప్రకటనల బోర్డులను తగిలించింది.. టమాటాలు లేకుండానే బర్గర్లు, ర్యాప్ లు సర్వ చేస్తామని ప్రకటించింది. సప్లై కొరత, డిమాండ్ కు తగ్గట్టుగా పంట ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగిపోయి టమాటా కొనలేని పరిస్థితి ఏర్పడిందని మెక్ డొనాల్డ్స్ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల మెనూలో నుంచి టమాటాలు తొలగించామని ఆ కంపెనీ వివరిస్తున్నది. “దేశంలో నాణ్యమైన టమాటాలు దొరకడం లేదు.. మా వినియోగదారులకు అత్యంత నాణ్యమైన ఆహారాన్ని అందించడమే మా లక్ష్యం. ఎన్ని ఇబ్బందులు పడినా సరే నాణ్యమైన టమాటాలు పొందలేకపోతున్నాం. నాణ్యంగా లేని టమాటాలతో బర్గర్లు, ర్యాప్ లు తయారు చేయడం కష్టం. అందుకే మా మెనూ లో నుంచి తొలగించామని” మెక్ డొనాల్డ్స్ నార్త్,ఈస్ట్ విభాగం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని తన రెస్టారెంట్లలో ఈ ప్రకటనలు విడుదల చేసింది. అయితే ఇది తాత్కాలికంగానే ఉంటుందని మెక్ డొనాల్డ్స్ కంపెనీ చెబుతోంది.
మరోవైపు దేశంలో టమాటాల ధర దిగిరావడం లేదు. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, పంట ఉత్పత్తి సరిగా లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. సరిగా మూడు నెలల క్రితం టమాటా ధర పడిపోవడంతో చాలామంది రైతులు దాని సాగు చేసేందుకు వెనుకంజ వేశారు. దీంతో సప్లై, డిమాండ్ మధ్య అంతరం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా టమాటా ధర ఆకాశాన్ని అంటుతోంది. కొత్త పంట వస్తే కానీ ధరలు తగ్గువని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో దాదాపు పంట విస్తీర్ణం తగ్గిపోగా ఏపీలోని మదనపల్లి, నగరి నుంచి మాత్రమే టమాటా మార్కెట్లోకి వస్తున్నది. స్థానిక అవసరాలి మినహాయించిన తర్వాతే ఈ పంటను మార్కెట్లోకి పంపిస్తున్నారు.. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మదనపల్లి నుంచి వచ్చే టమాటా ఈ మూలకూ సరిపోవడం లేదు. ఇక ఇదే ఆధునిక వ్యాపారులు ధరలు మరింత పెంచుతున్నారు.. ఫలితంగా మెక్ డోనాల్డ్స్ తీసేసినట్టే చాలామంది గృహిణులు తమ వంటల్లో నుంచి టమాటాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు.