
Maruti Cars: కారు కొందామనుకుంటున్నారా? అందులో మారుతి కారు కొనాలని ఫిక్స్ అయ్యారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చింది. కార్ల ధరలు పెంచేసింది. గతంలో కన్నా ఇప్పుడు మారుతీ కారు కొనాలంటే జేబు నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సిందే. ఈ నిర్ణయం కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ధరల పెరుగుదల ఇలా..
స్విఫ్ట్, సియాజ్, డిజైర్, ఎక్స్‌ఎల్ 6, వ్యాగనార్, సెలెరియో సహా పలు రకాల మోడళ్ల ధరలు పెరిగాయి. మారుతీ సుజుకీ వ్యాగనార్ మోడల్ ధర రూ.1,500 పెరిగింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.54 లక్షల నుంచి ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.7.4 లక్షల వరకు ఉంది. మారుతీ సుజుకీ సియాజ్ కారు ధర రూ.11 వేలు పెరిగింది. మారుతీ సుజుకీ సెలెరియో కారు ధర విషయానికి వస్తే.. రూ.1,500 పెరిగింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర ఇప్పుడు రూ. 5.36 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.
ఆ కారు ధర రూ.15 వేలు పెంపు..
ఇక మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్ 6 మోడల్ ధర అయితే ఏకంగా రూ.15 వేలకుపైగా పెంచేసింది. పెంపు తర్వాత ఈ మోడల్ ధర రూ. 11.41 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. స్విఫ్ట్ మోడల్ ధర రూ.5 వేలు పెరిగింది. దీంతో ఇప్పుడు ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 8.97 లక్షలుగా ఉంది.

డిజైర్ ధర పైపైకి..
ఇక మారుతీ సుజుకీ డిజైర్ కారు ధర కూడా పైపైకి చేరింది. దీని రేటు రూ.7,500 పైగా పెరిగింది. ఇప్పుడు దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.51 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. అంటే మారుతీ సుజుకీ కార్ల ధర పెంపు రూ.1,500 నుంచి ప్రారంభమవుతుంది. గరిష్టంగా కారు ధర రూ. 15 వేల వరకు పెరిగింది. దీంతో కొత్తగా కారు కొనే వారికి తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
కారు ధర పెంపు అనేది మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతుంది. మారుతి సుజుకీ కార్ల ధరలు పెంచిన నేపథ్యంలో ఇతర కంపెనీలు కూడా మారుతీ దారిలోనే పయనించే అవకాశం ఉందని తెలుస్తోంది.