Hyderabad: అమ్మ ఆయువును ఇస్తే..ఆ ప్రాణానికి ఓ రూపం ఇచ్చి వ్యక్తిగా తీర్చిదిద్దేది నాన్న. పిల్లల ప్రతీ విజయం వెనుక..బాధలోనూ, కష్టంలోనూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేది నాన్నే. తల్లి ప్రేమ కనిపిస్తుంది. కానీ తండ్రి ప్రేమ కనిపించకుండా రక్షణ కవచంలా మారి పిల్లలను కాపాడుతుంది. సన్మార్గంలో పెంచాలని దండించినా, కఠినంగా ప్రవర్తించినా దాని వెనుక ఉన్న పరమార్ధం ప్రేమే. వారికి మంచి భవిష్యత్ ఇవ్వాలన్న ఆరాటంలో కఠినంగా వ్యవహరించే నాన్నలు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. కానీ మానసిక వికలాంగుడిగా పుట్టిన కుమారుడ్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు ఓ తండ్రి. కంటిరెప్పగా కాపాల్సిన వాడే కాటేయ్యడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కాళ్లవేల్లా పడింది. అయినా కనికరించలేదు. కర్కశాన్ని చూపడంతో ప్రతిఘటించింది. కానీ పోరాడి ఓడిపోయింది. మరణమే శరణ్యంగా భావించింది. బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో వెలుగుచూసింది.

కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన శ్రీధర్ సాప్ట్ వేర్ ఉద్యోగి. ఆయనకు 2013లో అదే ప్రాంతానికి చెందిన స్వాతితో వివాహం జరిగింది. వీరికి మానసిక వికలాంగుడైన ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. దీంతో శ్రీధర్ ఆ బాలుడ్ని వదిలించుకుందామని భార్య స్వాతిపై ఒత్తిడి తెచ్చేవాడు. అనాథ శరణాలయంలో విడిచిపెట్టేద్దామని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తల్లి మనసు అంగీకరించలేదు. ఎప్పటికప్పుడు ససేమిరా అనడంతో శ్రీధర్ నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. దీనికి శ్రీధర్ తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. అటు బాలుడి వైద్య ఖర్చులకు కూడా సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో స్వాతి తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బులు తెచ్చి వైద్యం అందించేది. అయితే అత్తింటివారి సూటిపోటి మాటలు స్వాతిని కృంగదీశాయి. బలవన్మరణానికి పురిగొల్పాయి. సోమవారం నివాసముంటున్న అంతస్తు నుంచి కిందకు దూకిన స్వాతి చనిపోయింది.

భర్త శ్రీధర్ తో పాటు అత్తమామలు స్వాతితో పాటు ఆమె కుమారుడి పట్ల కర్కశంగా వ్యవహరించారు. మానసిక వైకల్యంతో బిడ్డ పుట్టాడని మూడేళ్ల వరకూ చూడడానికి కూడా రాలేదు. దీంతో స్వాతి ధైర్యాన్ని పోగుచేసుకొని బిడ్డను కంటికిరెప్పలా సాకుతూ వచ్చింది. అనాథ శరణాలయంలో విడిచిపెడతామని ఒత్తడి చేయడంతో స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే పోలీసులు ఇరువురిని సర్ధిచెప్పి పంపించారు. కానీ శ్రీధర్ లో మార్పు లేకుండా పోయింది. వేధింపులు మానలేదు. భార్యను పొట్టనపెట్టుకోగా.. ఆ ఏడేళ్ల మానసిక వైకల్యం బాలుడికి తల్లిని దూరం చేశారు. శ్రీధర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వాతి తల్లిదండ్రులు కోరుతున్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.