Vijay Antony: బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ సమయంలో అనుకోని పరిణామం చోటు చేసుకుంది. విజయ్ ఆంటోనిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుంది. బిచ్చగాడు సీక్వెల్ గా బిచ్చగాడు 2 తెరకెక్కుతుంది. ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం మలేషియా వెళ్లారు. సముద్రంలో బోటు చేసింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విజయ్ ఆంటోని ఓ వాటర్ బోట్ ని డ్రైవ్ చేస్తున్నారు. కెమెరా మెన్ తో పాటు యూనిట్ సభ్యులు మరో పెద్ద బోట్ లో ఉండి చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో విజయ్ ఆంటోని నడుపుతున్న బోటు అదుపు తప్పి యూనిట్ ఉన్న పెద్ద బోటు లోకి దూసుకొచ్చింది.

దీంతో విజయ్ ఆంటోనికి గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని కౌలాలంపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు అక్కడే చికిత్స జరుగుతుంది. వైద్యులు హెల్త్ కండిషన్ అధికారిక సమాచారం ఇవ్వాల్సి ఉంది. విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యాడని తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
విజయ్ ఆంటోని మల్టీ టాలెంట్ ఆర్టిస్ట్. ఆయన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, సింగర్ అలాగే యాక్టర్. కోలీవుడ్ లో అన్ని విభాగాల్లో పదుల సంఖ్యలో చిత్రాలకు పని చేశారు. నిర్మాతగా కూడా వ్యవహరించారు. అనేక చిత్రాలు తెరకెక్కించారు. విజయ్ ఆంటోనికి సలీం, బిచ్చగాడు, కిల్లర్ మూవీలు ఫేమ్ తెచ్చిపెట్టాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్ ఆంటోని చిత్రాలపై అంచనాలు ఉంటాయి.

2016లో విడుదలైన బిచ్చగాడు అతిపెద్ద సంచలనం నమోదు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో వసూళ్ల వర్షం కురిపించింది. కోటీశ్వరుడైన యువకుడు తల్లి ప్రాణం కోసం బిచ్చమెత్తుకోవడం అనే కాన్సెప్ట్ జనాలకు తెగ నచ్చేసింది. దర్శకుడు శశి ఎమోషన్, లవ్, రొమాన్స్, కామెడీ జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. ఆ చిత్ర నిర్మాత విజయ్ ఆంటోనీనీ కాగా, ఆయనకు భారీ లాభాలు దక్కాయి. ఈ క్రమంలో బిచ్చగాడు 2 తెరకెక్కిస్తున్నాడు. ఈసారి విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించి, నటిస్తున్నాడు.