Crime: అసలే హోలీ పండుగ.. రంగులు పూసుకొని ఫుల్లుగా మద్యం సేవించాడు ఓ మందుబాబు. ఆ తర్వాత మటన్ తినాలని ఉబలాటపడ్డాడు. మటన్ తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు. కానీ ఆ భార్య మటన్ వండేందుకు నిరాకరించింది. దీంతో సహనం కోల్పోయిన ఆ తాగుబోతు మొగుడు ఏకంగా డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. సిల్లీ ఫిర్యాదు అని పోలీసులు పక్కనపెట్టారు. అయినా వదలకుండా దాదాపు ఆరు సార్లు ఈ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి విసిగించాడు. దీంతో చిర్రెత్తికొచ్చిన పోలీసులు పెట్రోలింగ్ టీంను ఆ మందుబాబు ఇంటికి పంపింది. కానీ అప్పటికే ఫుల్లుగా తాగి ఉండడంతో పోలీసులు వెళ్లిపోయారు. తెల్లవారి వచ్చి అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.
నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన నవీన్ (28) శుక్రవారం మద్యం మత్తులో హోలీ వేడుకలు చేసుకొని మటన్ కొని ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్యను మటన్ కూర వండిపెట్టమని కోరాడు. కానీ మద్యానికి బానిస అయిన నవీన్ కు వండిపెట్టేందుకు అతడి భార్య నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నవీన్ డయల్ 100కు ఫోన్ చేసిన తన భార్య తనకు మటన్ కూర వండడం లేదని ఫిర్యాదు చేశాడు.
మొదట నిందితుడు పొరపాటున చేశాడని పోలీసులు భావించి వదిలేశారు. ఫోన్ కట్ చేశారు. అయినా విడవకుండా నవీన్ 6 సార్లు ఇలాగే ఫోన్లు చేశాడు. దీంతో సీరియస్ అయిన పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకున్నారు. మద్యం తాగి ఉన్నట్లు గుర్తించడంతో అరెస్ట్ చేయలేదు. తెల్లవారి వచ్చి ఇతగాడిని పట్టుకెళ్లి కేసులు నమోదు చేసి షాకిచ్చారు.
తాగినమత్తులో అత్యవసర సమయాల్లో బాధితులు చేసే డయల్ 100కు ఫోన్ చేసి మందుబాబు అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్లు రుచిచూపించారు. డయల్ 100కు ఫోన్ చేసే ఆకతాయిలు ఇకనైనా ఈ ట్రీట్ మెంట్ తో బుద్దితెచ్చుకోవాలని పలువురు హితవు పలుకుతున్నారు.
Recommended Video: