
AP Politics: ఏపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేచింది. నేమ్ లోనే ఫేమ్ ఉందని పార్టీలు నమ్ముతున్నట్లున్నాయి. సంక్షేమ పథకాలు, వాగ్దానాలకు మించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాల పేర్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ మేరకు మేనియా సృష్టించి ఓట్లు కొల్లగొట్టడమే ప్రధాన ఎత్తుగడ. ఒకరిని మించి ఒకరు ఆద్యంతం ఆసక్తి గొలిపే టైటిల్స్ తో కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు. పేర్ల ఎంపికతోనే సగం విజయం సిద్ధిస్తుందని భావిస్తున్న పార్టీల తీరుపై ప్రత్యేక కథనం.
రాష్ట్రంలో రాజకీయ హీట్ పెరుగుతుంది. ఎన్నికలకు ఇంకో ఏడాదే సమయం ఉండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు గెలుపే ధ్యేయంగా ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఇందుకోసం ఆకట్టుకునే పేర్లతో కార్యక్రమాలను రూపకల్పన చేసుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. నిత్యం ప్రజల్లో నాయకులు ఉండాలని టీడీపీ, వైసీపీ అధినేతలు శ్రేణులను ఆదేశించారు. అందుకు తగ్గ కార్యక్రమాలను రూపొందించి జనాల్లో నోట్లో త్వరగా నానుతూ ఉండేలా, ఉచ్ఛరించినా అదే కోరుకుంటున్నట్లు తెలియజేసేలా పేర్లను పెడుతున్నారు. ఇందులోనూ మైండ్ గేమ్ లేకపోలేదు.
అన్ని పార్టీలకు సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. ఏ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా, ప్రకటించినా గద్దలా వాలిపోతూ మారుమూల ప్రజలకు తెలిసేలా షేరింగ్ లు చేసేస్తున్నారు. ప్రచారంలో టీడీపీ కంటే వైసీపీ ఒకడుగు ముందు వరుసలో ఉండేలా ప్లాన్ వేస్తుంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి చెక్ పెడుతూ టీడీపీ అధినాయకత్వం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని రూపొందించింది. రెండు కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడమే.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రజల్లో వ్యతిరేకత ప్రస్ఫుటమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరిన్ని కార్యక్రమాలను సిద్ధం చేశారు. రాబోవు ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఆ మేరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. గత ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో కార్యక్రమాలను నిర్వహించారు. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ పేరుతో ప్రజల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యారు. అధికారం చేపట్టిన తరువాత అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో టీడీపీ ఇటీవల ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అన్న నినాదాన్ని అందుకుంది.

‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమ ప్రారంభోత్సవాల్లో వైసీపీ నేతలు ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. పేదలకు వైద్యం చేరువ చేయాలన్నదే ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమట. వాస్తవానికి చాలా చోట్ల వైద్య పరీకరాలు అందుబాటులో లేవు. సరైన వైద్యుల నియామకాలు జరగలేదు. వైద్య పరీక్షలు కూడా ప్రైవేటుపైనే పేదలు ఆధారపడాల్సిన దుస్థితులు చాలా చోట్ల నెలకొని ఉన్నాయి. ఆయా సమస్యలను పరిష్కరించకుండా 104 వాహనాలతో వైద్య సేవలు అందిస్తామనడంపై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
ఓ వైపు ధరలు పెరిగిపోయి సామాన్యలు పరిస్థితి అల్లాడిపోతున్నారు. కులాల పరంగా, ప్రాంతాలపరంగా హామీలు ఇస్తున్నా, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు పార్టీలు ఏం చేయదల్చుకున్నారో చెప్పకుండా మభ్యపెట్టేలా కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరూ నమ్మే స్థితిలో లేరు. వాస్తవానికి జగన్ రాష్ట్రాన్ని అప్పులకు కేరాఫ్ గా మార్చివేశారు. విశాఖ ఉక్కుతో సహా చాలా పరిశ్రమలను, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోను ఆ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. ముఖ్యమైన ఈ విషయాలపై తమ ధోరణిని తెలపకుండా, సంక్షేమం అంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఎన్ని ఆకర్షణీయమైన పేర్లతో కార్యక్రమాలను రూపకల్పన చేసినా, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.